కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిచ్చిన దీదీ
కాంగ్రెస్ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ
By Medi Samrat Published on 24 Jan 2024 3:01 PM ISTకాంగ్రెస్ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఊహించని షాక్ ఇచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తుందని సంచలన ప్రకటన చేశారు. బెంగాల్ వరకు సీట్ల పంపకం విషయంలో మా పార్టీ కాంగ్రెస్‌తో టచ్‌లోనే లేదని తేల్చేశారు మమతా. ఈ అంశంపై మేం ఇప్పటివరకు ఆ పార్టీలో ఎవరితోనూ మాట్లాడలేదని, మా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో మేం ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోసం రాష్ట్రాల వారీగా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఇంతలోనే మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు.