ఎన్నికల ప్రచారంపై కీలక నిర్ణయం తీసుకున్న దీదీ..!
Mamata Banerjee cancels 'big' Kolkata rallies. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించేశారు.
By Medi Samrat
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూ ఉంది. ఎన్నికల ర్యాలీలు కూడా కరోనా ఉధృతికి కారణమేనని నిపుణులు చెబుతూ ఉన్నారు. దీంతో పలువురు నాయకులు తమ ఎన్నికల ర్యాలీల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇటువంటి నిర్ణయమే తీసుకున్నారు. కోల్‌కతాలో నిర్వహించబోయే ర్యాలీల్లో ఆమె పాల్గొనరని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రియెన్ తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలోనే మమత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఏప్రిల్ 26న మాత్రమే కోల్‌కతాలో మమత ముగింపు సమావేశాన్ని నిర్వహిస్తారని చెప్పారు. అంతకుముందు జిల్లాల్లో ఆమె పాల్గొనబోయే అన్ని ఎన్నికల ర్యాలీల సమయాన్ని 30 నిమిషాలకు కుదించారు.
అంతకు ముందు మమతా బెనర్జీ మాట్లాడుతూ భారతదేశంలో కరోనా మహమ్మారి కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని.. ఆరోగ్య అత్యయిక స్థితిని ఎదుర్కొనడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపించారు. గత ఏడాది సెప్టెంబరులో మొదటి వేవ్ తర్వాత ఎంతో సమయం ఉన్నా కూడా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనడానికి కేంద్రం సిద్ధం కాలేకపోయిందని అన్నారు. అవసరాలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్, టీకాల సరఫరా లేక రాష్ట్రాలు అల్లాడుతున్నాయని... ఈ సమస్యను అధిగమించడానికి మోదీ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. దేశంలో ఒకవైపు వ్యాక్సిన్లకు కొరత ఉంటే మరోవైపు మోదీ అంతర్జాతీయంగా తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి విదేశాలకు టీకాలను ఎగుమతి చేశారన్నారు.