మహారాష్ట్రలోని థానేకు చెందిన 24 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ వీసా పొందేందుకు నకిలీ పత్రాలను రూపొందించి పొరుగు దేశానికి వెళ్లి వచ్చిన ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. నగ్మా నూర్ మక్సూద్ అలియాస్ సనమ్ ఖాన్‌ను మూడు రోజుల విచారణ తర్వాత వర్తక్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా, రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనమ్ ఖాన్ పాకిస్థాన్ వీసా పొందేందుకు సనమ్ ఖాన్ రూఖ్ పేరుతో నకిలీ గుర్తింపును ఉపయోగించింది. నకిలీ కాగితాలతో ఆధార్, పాన్ కార్డులను పొందినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. భర్త నుంచి విడిపోయిన సనమ్ థానేలో తన తల్లితో కలిసి ఉంటోంది. ఆమెకు సోషల్ మీడియాలో పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి పరిచయం ఏర్పడింది. అతనిని కలవడానికి వీసా కోసం ప్రయత్నించింది.
అయితే వివాహ పత్రాలు లేకపోవడంతో ఆమెకు మొదట వీసా ఇవ్వలేదు. ఆ మహిళ తర్వాత భారతదేశానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నట్లుగా నటించి కావాల్సిన పత్రాలను పొందింది. ఆ తర్వాత ఆమె పాకిస్తాన్‌కు వెళ్ళింది. ఈ విషయాన్ని తెలుసుకున్న థానే పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆమెకు నకిలీ పత్రాలను అందించిన వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.