ఇద్దరు మూడేళ్ల బాలికలపై లైంగిక వేధింపులు, క్లీనింగ్ సిబ్బంది అరెస్ట్
మహారాష్ట్రలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2024 9:55 AM GMTఇద్దరు మూడేళ్ల బాలికలపై లైంగిక వేధింపులు, క్లీనింగ్ సిబ్బంది అరెస్ట్
మహారాష్ట్రలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ డాక్టర్‌పై అత్యాచార సంఘటన మరవకముందే.. మహారాష్ట్రలో ఇద్దరు మూడేళ్ల బాలికలపై క్లీనింగ్ సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. థానే జిల్లాలోని కో-ఎడ్ స్కూల్ ప్రీ-ప్రైమరీ స్కూల్‌లో ఈ సంఘటన జరిగింది. అయితే.. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కేసును వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నతస్థాయి పోలీసు అధికారి ఆర్తీ సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు.
కాగా.. ఆగస్టు 12, 13 తేదీల్లో ఇద్దరు బాలికలు టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో క్లీనింగ్ సిబ్బంది లైంగికంగా వేధించాడు. రెండ్రోజుల సంఘటనలో భయపడిపోయిన ఇద్దరు బాలికలు స్కూలుకి వెళ్లేందుకు నిరాకరించారు. వారి తల్లిదండ్రులు ఏం జరిగిందని అడగ్గా.. విషయం చెప్పారు. దాంతో వెలుగులోకి వచ్చింది క్లీనింగ్ సిబ్బంది నిర్వాకం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్షయ్ షిండేను అరెస్ట్ చేశారు. మూడు రోజుల పోలీసు రిమాండ్‌కు కోర్టు అప్పగించింది. విచారణలో భాగంగా.. సంఘటన జరిగిన రోజు సీసీ కెమెరాలు పని చేయలేదని పాఠశాల యాజమాన్యం పోలీసులకు తెలిపింది.
ఈ సంఘటనపై మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దీపక్ కేసర్కర్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం ఉన్న భద్రతా చర్యలను మరింత పటిష్టం చేసేలా చూస్తాము. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా సిసిటివిలు పనిచేయాలని మేము సర్క్యులర్ జారీ చేస్తున్నాము. ఒక కమిటీని నియమిస్తాము. ఈ కేసును త్వరితగతిన విచారించి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, క్లాస్ టీచర్, ఇద్దరు సహాయకులను సస్పెండ్ చేశాం'' అని విద్యాశాఖ మంత్రి దీపక్ కేసర్కర్ చెప్పారు.
#WATCH | On the incident of alleged sexual assault with a girl child at a school in Badlapur, Maharashtra Education Minister Deepak Kesarkar says, "We will see to it that the existing safety measures are further strengthened. We are issuing a circular today that CCTVs must be… pic.twitter.com/iZDzS7ET32
— ANI (@ANI) August 20, 2024
ఈ సంఘటన బద్లాపూర్ అంతటా విస్తృత నిరసనలకు దారితీసింది, ఆగ్రహించిన నిరసనకారులు బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో లోకల్ రైళ్లను ఆపారు. ఇతర సంస్థలు మంగళవారం మూసివేయబడ్డాయి. లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపించిన పాఠశాలను కూడా మూసి వేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో మద్దతుదారులతో పాటు స్థానిక రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి.