కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురు దుర్మరణం

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  23 May 2024 4:40 PM IST
maharashtra, thane, chemical factory, fire accident, four dead  ,

కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురు దుర్మరణం 

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముంబై దగ్గరున్న థానెలోని డోంబివాలిలో గురువారం మధ్యాహ్నం కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. భారీ పేలుడు సంభవించిన తర్వాత మంటలు వ్యాపించాయి. ఫ్యాక్టరీ మొత్తం పూర్తిగా మంటలు అంటుకోవడంతో అందులో చాలా మంది కార్మికులు చిక్కుకు పోయారు. ఎండీసీ ఫేజ్‌-2లో ఉన్న కెమికల్‌ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

కాగా.. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని దుర్మరణం చెందారని చెబుతున్నారు. మరో 25 మందికి పైగా కార్మికులు గాయపడ్డారని వెల్లడించారు. ఇక ఫ్యాక్టరీలో వరుసగా మూడుసార్లు పేలుళ్లు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. ఇప్పటి వరకు నలుగురు చనిపోయినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు.

ఈ సంఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం స్పదించారు. డోంబివిలి ఎంఐడీసీలోని అముదన్ కెమికల్‌ కంపెనీలో అగ్నిప్రమాదం బాధాకరమని అన్నారు. ఈ సంఘటనలో ఇప్పటికే పలువురిని కాపాడామనీ.. వారికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మరిన్ని అంబులెన్స్‌లను కూడా సంఘటనాస్థలం వద్ద అందుబాటులో ఉంచామని అన్నారు. కలెక్టర్‌కు తగు ఆదేశాలు జారీ చేశామనీ.. అందువల్ల 10 నిమిషాల్లోనే అగ్నిప్రమాద సంఘటన స్థలానికి అధికారులంతా వెళ్లారని ఫడ్నవీస్ వెల్లడించారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

ఇంకా కెమికల్ ఫ్యాక్టరీ వద్ద మంటలను అదుపు చేసేందుకు 15 ఫైరింజన్లు ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని అధికారులు చెబుతున్నారు. మంటలను పూర్తిగా అందుపు చేసేందుకు మరో నాలుగు గంటల సమయం పడుతుందని అంటున్నారు. కెమికల్‌ ఫ్యాక్టరీ నుంచి మంటలు పక్కనున్న మరో రెండు భవనాలకు అంటుకున్నాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇళ్ల అద్దాలు పగిలిపోయాయని తెలిసింది.


Next Story