లాక్‌డౌన్ కి సిద్ధం అవుతున్న మహారాష్ట్ర

Maharashtra Govt Ready to Impose Lockdown. మహారాష్ట్రలో రెండో విడత లాక్‌డౌన్‌ విధించే విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది.

By Medi Samrat  Published on  29 March 2021 4:47 AM GMT
Maharashtra Govt Ready to Impose Lockdown

పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో మహారాష్ట్రలో రెండో విడత లాక్‌డౌన్‌ విధించే విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. సెకండ్ వేవ్ తీవ్రతకు ప్రజల నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్న ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్థిక రంగంపై ప్రభావం పడకుండా లాక్‌డౌన్‌ను ఎలా విధించాలో కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదేశించారు.

ఈసారి లాక్డౌన్ విధించాల్సి వస్తే ఎటువంటి గందరగోళానికి ఆస్కారం లేకుండా ముందుకెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపె, వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆదివారం అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌-19 రోగుల కోసం ఆసుపత్రుల్లో సిద్ధం చేసిన పడకలు, ఆక్సిజన్‌, వైద్య సామగ్రి.. తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కరోనాను అరికట్టాలంటే కఠినమైన లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వానికి కొవిడ్‌-19 టాస్క్‌ ఫోర్స్‌ సిఫార్సు చేసింది.

గత వారం నుంచి మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే లక్ష మందికి కరోనా నిర్ధరణ కావటం కలకలం రేపుతోంది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 40,414 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క శనివారం రోజే మహారాష్ట్రలో 166 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. 2021లో ఇప్పటిదాకా ఒక్కరోజులో ఇన్ని కరోనా మరణాలు మహారాష్ట్రలో నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కట్టడి కోసం మార్చి 28 నుంచి రాష్ట్రంలో 144 సెక్షన్ అమలుచేస్తున్నారు. అయిదుగురి కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడటాన్ని నిషేధించింది. పండగలు, శుభకార్యాలతో పాటు రాజకీయ, మతపరమైన ర్యాలీలు, కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఇంత చేస్తున్నప్పటికి కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఇక పూర్తి స్థాయి లాక్‌డౌనే పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోంది.


Next Story