ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్‌ను ప్రకటించిన సీఎం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే భారీ ప్రకటన చేశారు
By Medi Samrat Published on 15 Oct 2024 3:45 PM GMTమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే భారీ ప్రకటన చేశారు. కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్‌ను ప్రకటించారు. బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ఉద్యోగులకు రూ.29 వేలు బోనస్ కూడా లభిస్తుందని షిండే తెలిపారు. విశేషమేమిటంటే.. గతేడాది బోనస్ కంటే ఈ ఏడాది మూడు వేల రూపాయలు ఎక్కువగా ప్రకటించారు. కిండర్ గార్టెన్ (కెజి) తరగతి పిల్లలకు బోధించే ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు కూడా బోనస్ ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం తెలిపింది. ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా మదర్సా ఉపాధ్యాయుల వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోకి వచ్చినందున ఈరోజు ప్రభుత్వం చేసిన ప్రకటన కీలకం కానుంది. ఎలక్షన్ కోడ్ కారణంగా ఇప్పుడు ప్రభుత్వ ప్రయోజనాలను ప్రకటించడంపై నిషేధం ఉంటుంది. అయితే.. కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఆమోదం తర్వాత డబ్బును విడుదల చేయవచ్చు.
గతంలో అక్టోబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం మదర్సా టీచర్ల వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. సీఎం షిండే అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఈడీ చదివిన మదర్సా ఉపాధ్యాయుల గౌరవ వేతనాన్ని రూ.6,000 నుంచి రూ.16,000కు, బీఏ, బీఈడీ, బీఎస్సీ డిగ్రీలు ఉన్న ఉపాధ్యాయుల గౌరవ వేతనాన్ని రూ.8 వేల నుంచి రూ.18 వేలకు పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్రలో రాజకీయ కార్యకలాపాలు జోరందుకున్నాయి. మరో 38 రోజుల తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. నవంబర్ 20న ఓటింగ్, 23న ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.