మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి సుప్రీం కోర్టు ప్రకటనపై ఉద్దవ్ థాకరే స్పందించారు. తాను నైతికతతో రాజీనామా చేశానని.. నాడు గవర్నర్ నిర్ణయం కూడా తప్పు అని అదే సుప్రీం కోర్టు తెలిపిందని అని అన్నారు ఉద్ధవ్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాడు నైతిక బాధ్యతగా తాను ఎలా అయితే రాజీనామా చేశానో ఈ రోజు షిండే కూడా అలాగే చేయాలన్నారు. షిండే వర్గం పార్టీకి, తన తండ్రికి వెన్నుపోటు పొడిచిందన్నారు. చట్టపరంగా తన రాజీనామా తప్పు కావొచ్చు, కానీ నైతికంగా తాను చేసింది సరైనదే అన్నారు.
మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని సుప్రీం కోర్టు తాజాగా స్పష్టం చేసింది. ఉద్ధవ్ ఠాక్రే ఫ్లోర్ టెస్ట్‌ను ఎదుర్కోలేక తన రాజీనామాను సమర్పించినందున.. యథాతథ స్థితిని పునరుద్ధరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అతిపెద్ద పార్టీ బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండేతో గవర్నర్ ప్రమాణం చేయించడం సమర్థనీయమని కోర్టు తెలిపింది.