బస్సులో చెలరేగిన మంటలు.. 25 మంది సజీవదహనం
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని 25 మంది సజీవదహనం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 1 July 2023 3:47 AM GMTబస్సులో చెలరేగిన మంటలు..25 మంది సజీవదహనం
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 25 మంది సజీవదహనం అయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మహారాష్ట్రలోని యావత్మాల్ నుంచి పుణె వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బుల్దానాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటలకు రన్నింగ్‌లో ఉన్న బస్సు టైర్ పేలింది. వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఆ సమయంలోనే మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి కావడంతో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు పల్టీ కొట్టాక ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే 25 మంది సజీవదహనం అయ్యారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైరింజన్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో బుల్దానా సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వారి డెడ్‌బాడీస్‌ను పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే.. మృతులు, క్షతగాత్రుల వివరాలను గుర్తించి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు పోలీసులు. బస్సు బోల్తా పడ్డ వెంటనే బస్సు డ్రైవర్ బయటకు వచ్చాడని.. అతడు ప్రాణాలతో బయటపడ్డాడని చెబుతున్నారు పోలీసులు.
ఘోర ప్రమాద ఘటనతో స్థానిక జనం అంతా ఉలిక్కిపడ్డారు. ఘటనాస్థలిలో పడివున్న కాలిపోయిన వస్తువులను చూసి ఆవేదన చెందుతున్నారు. అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేశామని.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని బుల్దానా పోలీసులు తెలిపారు.