మద్యంమత్తులో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్.. పరారీ

మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కుమారుడు ఆడీ కారు పలు వాహనాలను ఢీకొట్టింది.

By Srikanth Gundamalla  Published on  10 Sep 2024 3:57 AM GMT
మద్యంమత్తులో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్.. పరారీ

మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కుమారుడికి చెందిన ఆడీ కారు పలు వాహనాలను ఢీకొట్టింది. మద్యం మత్తులో మరో నలుగురితో కలిసి ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆడి కారులో సోమవారం నాగ్‌పూర్‌లో పలు వాహనాలను ఢీ కొట్టాడు. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు. ఆయా వాహనాలను ఢీకొట్టిన తర్వాత కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంకేత్ బవాన్‌కులేతో సహా మిగిలిన ముగ్గురు సంఘటనా స్థలం నుండి పారిపోయారని చెప్పారు.

నగరంలోని రామ్‌దాస్‌పేత్ ప్రాంతంలో ప్రమాదం జరిగిన సమయంలో అర్జున్ హవారే, రోనిత్ చింతన్‌వార్ మద్యం మత్తులో ఉన్నారని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆడి కారు మొదట అర్ధరాత్రి 1 గంటలకు ఫిర్యాదుదారు జితేంద్ర సోన్‌కాంబ్లే కారును ఢీకొట్టింది. ఆపై మోపెడ్‌ను ఢీకొట్టింది.. దానిలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ కుమారుడు సంకేత్ బవాన్‌కులే సహా మొత్తం ఐదుగురు ఉన్నారు. ఘటన జరగడానికి ముందు నిందితులు ధరంపేత్‌లోని ఓ బార్‌ నుంచి తిరిగి వస్తున్నట్లు సమాచారం.

'ఆడి మాన్కాపూర్ ప్రాంతం వైపు వెళుతున్న మరికొన్ని వాహనాలను ఢీకొట్టింది. టి-పాయింట్ వద్ద వాహనం పోలో కారును ఢీకొట్టింది. అందులో ఉన్నవారు ఆడిని వెంబడించి మాన్కాపూర్ వంతెన దగ్గర ఆపారు. సంకేత్ బవాన్‌కులేతో సహా ముగ్గురు ప్రయాణీకులు పారిపోయారని అధికారులు చెప్పారు. కారు డ్రైవర్ అర్జున్ హవ్రేతో పాటు మరో వ్యక్తి రోనిత్ చిట్టంవార్‌ను పోలో కారులో ఉన్నవారు అడ్డుకున్నారు. వారిని తహసీల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుండి తదుపరి విచారణ కోసం సీతాబుల్డి పోలీసులకు అప్పగించారు. సోన్‌కాంబ్లే ఫిర్యాదు మేరకు ర్యాష్ డ్రైవింగ్ తో పాటు ఇతర కేసులను పోలీసులు నమోదు చేశారు. ఇక హవ్రే, చిట్టమ్వార్ తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు.

మరోవైపు ఈ సంఘటనపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ చంద్రశేఖర్‌ బవాన్‌కులే స్పందించారు. ఆడి కారు తన కుమారుడి పేరిటే రిజిస్టర్ అయినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తాను ఏ పోలీసు అధికారితో మాట్లాడలేదనీ.. చట్టం అందరికీ సమానంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు.




Next Story