మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని అరెస్ట్
మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నిందితులలో ఒకరైన, ప్లాట్‌ఫారమ్ యజమాని రవి ఉప్పల్‌ను స్థానిక అధికారులు దుబాయ్ లో అదుపులోకి తీసుకున్నారు
By అంజి Published on 13 Dec 2023 9:27 AM ISTమహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని అరెస్ట్
మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నిందితులలో ఒకరైన, ప్లాట్‌ఫారమ్ యజమాని రవి ఉప్పల్‌ను స్థానిక అధికారులు దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులు, ముంబై పోలీసులు రవి ఉప్పల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఆచూకీ లభించలేదు. దీంతో ఇంటర్‌పోల్ ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గత వారం నిర్బంధంలో ఉన్న ఉప్పల్‌ను భారత్‌కు రప్పించేందుకు అరబ్ దేశంలోని అధికారులతో అధికారులు టచ్‌లో ఉన్నారని మనీలాండరింగ్ నిరోధక సంస్థ తెలిపింది. మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ యొక్క ఇద్దరు ప్రధాన యజమానులలో ఒకరైన రవి ఉప్పల్‌ను ఈడీ ఆదేశాల మేరకు ఇంటర్ పోల్ జారీ చేసిన రెడ్ నోటీసు ఆధారంగా చేసుకుని స్థానిక పోలీసులు దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి.
గత వారం రోజుల క్రితం రవి ఉప్పల్ (43)ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడిని భారత్‌కు రప్పించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దుబాయ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని వారు తెలిపారు. అయితే ఈ విధంగా అక్రమ బెట్టింగ్‌లు నిర్వహించడమే కాకుండా మనీలాండరింగ్ కు పాల్పడడంతో రవి ఉప్పల్‌ను ఛత్తీస్గఢ్ పోలీసులు, ముంబై పోలీసులతో పాటు ఈడీ విచారిస్తోంది. ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ ఉప్పల్, ఇంటర్నెట్ ఆధారిత ప్లాట్‌ఫారమ్ యొక్క మరొక ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్‌పై ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ లో ఉన్న ప్రత్యేక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కోర్టులో అక్టోబర్‌లో మనీలాండరింగ్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
భారత పౌరసత్వాన్ని వదులుకోనప్పటికీ, పసిఫిక్ మహాసముద్రంలోని వనాటు అనే ద్వీప దేశంలో ఉప్పల్ పాస్‌పోర్ట్ తీసుకున్నట్లు చార్జ్ షీట్‌లో ఏజెన్సీ కోర్టుకు తెలియజేసింది. ఈ కేసులో దాదాపు రూ.6,000 కోట్ల మేర నేరం జరిగినట్లు ఈడీ అధికారులు అంచనా వస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మహదేవ్ బుక్, రెడ్డన్న ప్రెస్టోప్రోతో సహా 22 అక్రమ బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని నవంబర్ 5న ఆదేశించింది. అక్రమ బెట్టింగ్ యాప్ సిండికేట్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు, ఛత్తీస్‌గఢ్‌లోని మహాదేవ్ బుక్ యాప్‌పై జరిగిన దాడులు పెద్ద సంచలన విషయాలను బయటపెట్టాయి. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సుమారు రూ.508 కోట్లు క్యాష్ కొరియర్ చేసినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి.