ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళాకు భక్తులు పోటెతతారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఇవాళ్టి నుంచి 45 రోజుల పాటు కుంభమేళా కొనసాగనుంది. భూ మండలంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా దీనిని పేర్కొంటారన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం సోమవారం ఉదయం 8 గంటలకు త్రివేణి సంగమంలో దాదాపు 40 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు.
మహా కుంభమేళాకు భారతీయులతో పాటు విదేశీయులూ ఎక్కువగానే వస్తున్నారు. నేడు పుష్య పౌర్ణమి కావడంతో ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమం వద్ద వారు పవిత్ర స్నాలు ఆచరించారు. గంగ నీరు చల్లగా ఉన్నప్పటికీ తమ మనసులు వెచ్చదనంతో నిండాయని అంటున్నారు. బ్రెజిల్, స్పెయిన్, రష్యా, పోర్చుగల్, జర్మనీ, సౌతాఫ్రికా నుంచి వచ్చిన కొందరు మీడియాతో మాట్లాడారు. యోగా, మోక్షం, పుణ్యం, ఆధ్యాత్మికత, దేవుడు, భక్తి గురించి చెబుతున్నారు. అటు గంగా పరిసరాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 45 కోట్ల మందికిపైగా భక్తులు ఈ కార్యక్రమానికి వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. దీని నిర్వహణ కోసం యూపీ ప్రభుత్వం రూ.7 వేల కోట్లు కేటాయించింది. ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది.