అంగన్‌వాడీ కార్యకర్తలకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వేతనాలు పెంచుతున్నట్లు తెలిపింది. అంగన్‌వాడీ కార్యకర్తలకు 20 శాతం, హెల్పర్‌లకు 10 శాతం వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా శుక్రవారం అసెంబ్లీలో తెలిపారు. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి 'ట్రాక్ యాప్' కలిగి ఉన్న కొత్త మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేసినట్లు తెలిపారు.
చట్టాన్ని ఉల్లంఘించినందుకు మహారాష్ట్రలోని ఆరుగురు దగ్గు సిరప్ ఉత్పత్తిదారుల లైసెన్స్‌లను సస్పెండ్ చేసినట్లు ఫుడ్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి సంజయ్ రాథోడ్ అసెంబ్లీలో చెప్పారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే ఆశిష్ షెలార్ మరియు ఇతరుల నుండి కాలింగ్ అటెన్షన్ నోటీసుకు ప్రతిస్పందనగా ఈ విషయాన్ని తెలియజేశారు.
రాష్ట్రంలోని 108 మంది దగ్గు సిరప్ ఉత్పత్తిదారులలో 84 మందిపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపిందని అసెంబ్లీలో రాథోడ్ ప్రకటించారు. ఆరు కంపెనీల లైసెన్సులను సస్పెండ్ చేయగా, వాటిలో నాలుగింటి తయారీని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 17 సంస్థలకు షోకాజ్ నోటీసులు పంపినట్లు చెప్పారు.