హర్యానాలో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు
Magnitude 3.7 Earthquake In Haryana.సోమవారం రాత్రి ఢిల్లీకి సమీపంలో ఉన్న హర్యానాలో భూకంపం సంభవించింది.
By తోట వంశీ కుమార్ Published on 6 July 2021 10:36 AM ISTసోమవారం రాత్రి ఢిల్లీకి సమీపంలో ఉన్న హర్యానాలో భూకంపం సంభవించింది. దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో కనిపించింది. రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాలోని ఝజ్జర్ జిల్లా కేంద్రానికి ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో, భూమిలోపల 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతం ఢిల్లీకి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. కాగా ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకూ తెలియరాలేదు.
Earthquake of Magnitude 3.7 hit 10-km north of Jhajjar, Haryana at 10:36 pm: National Center for Seismology pic.twitter.com/x8EUmqNYc8
— ANI (@ANI) July 5, 2021
సోమవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడం జనం భయాందోళనలు చెందారు. వెంటనే భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి భవనాలు, ఇంట్లోని భారీ వస్తువులు సైతం కదిలాయని పలువురు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే, ఫాల్ట్‌లైన్‌కు దగ్గరగా ఉన్న ఢిల్లీలో భారీ భూకంపాలకు గురవుతుందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 12 నుంచి ఢిల్లీ నేషనల్‌క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) రెండు డజన్ల భూకంపాలను నమోదు చేసింది. నగరం సీస్మిక్ జోన్-4లోకి వస్తుందని, ఇది చాలా ఎక్కువ ముప్పు ఉన్న జోన్ అని తెలిపారు.