దారుణం: మహిళలను సజీవంగా సమాధి చేసే యత్నం.. వీడియో
రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడంతో ఇద్దరు మహిళలను మట్టిలో సజీవింగా పూడ్చేందుకు ప్రయత్నం చేశారు.
By Srikanth Gundamalla Published on 22 July 2024 10:23 AM ISTదారుణం: మహిళలను సజీవంగా సమాధి చేసే యత్నం.. వీడియో
మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడంతో ఇద్దరు మహిళలను మట్టిలో సజీవింగా పూడ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే.. వెంటనే స్థానికులు స్పందించి వారిని బయటకు లాగడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రేవా జిల్లాలోని మాంగ్వా పోలీస్ స్టేషన్ పరిధి హినోటా జరోట్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయివేటు భూమిలో రోడ్డు వేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. దాంతో.. భూమి యజమానులురోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రోడ్డు నిర్మాణానికి అడ్డుపడుతున్న ఇద్దరు మహిళలపై ట్రక్కులో మట్టి తెచ్చి వారిపై ఒక్కసారిగా గుమ్మరించారు. వారిని సజీవంగా సమాధి చేసేందుకు ప్రయత్నించారు. బాధితులు మమతా పాండే, ఆశా పాండేగా గుర్తించారు. మట్టిలో మెడల వరకు పాతిపెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. వెంటనే స్పందించిన స్థానికులు మట్టిన పక్కకు తవ్వి.. వారిని బయటక లాగారు. ఆ తర్వాత వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత ఇద్దరు బాధిత మహిళలు డిశ్చార్జ్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి.. డంపర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. భూతగాదాలే కారణమని పోలీసులు చెబుతున్నారు. రాజకీయంగా కూడా ఈ సంఘటన దుమారం రేపుతోంది. బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం మౌనంగా ఉండటంపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బ్రతికుండగానే మహిళలను మట్టిలో పూడ్చే యత్నంమధ్యప్రదేశ్ - రీవా జిల్లాలో తమ భూమిలో రోడ్డు వేయొద్దని ఇద్దరు మహిళలు నేలపై కూర్చుని ఆందోళన చేస్తున్నారు. కానీ ఇవేమీ పట్టించుకోని ట్రక్కు డ్రైవర్ అందులోని మట్టి వారిపై పోశాడు. దీంతో నడుములలోతు వరకు వారు పూడుకుపోయారు. pic.twitter.com/MSBKSlDDFJ
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2024