కావడి యాత్రలో విషాదం.. నలుగురు యాత్రికులు మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 July 2024 6:00 AM GMTకావడి యాత్రలో విషాదం.. నలుగురు యాత్రికులు మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కావడి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఒక ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురు కావడి యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
మొరెనా జిల్లాలోని సివిల్ లైన్ పోలీస్ పరిధిలో ఉన్న 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. డియెరీ గ్రామ సమీపానికి రాగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు కావడి యాత్రకు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కావడి యాత్రికులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. మొత్తంగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దాంతో.. మృతుల సంఖ్య నలుగురికి చేరింది. ఇక ప్రస్తుతం 12 మంది ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. కొందరు కావడి యాత్రికులు ఖాదియాహర్ గ్రామం నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోని గంగా ఘాట్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు .