ప్యాంట్‌పై బుర‌ద‌.. బ‌ల‌వంతంగా తుడిపించి మ‌రీ కొట్టిన‌ మ‌హిళా పోలీసు

Madhya Pradesh cop forces man to clean her trousers.కొంద‌రు ఒంటిపై ఖాకీ చొక్కా ఉంది క‌దా అని విర్ర‌వీగుతుంటారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2022 5:27 PM IST
ప్యాంట్‌పై బుర‌ద‌.. బ‌ల‌వంతంగా తుడిపించి మ‌రీ కొట్టిన‌ మ‌హిళా పోలీసు

కొంద‌రు ఒంటిపై ఖాకీ చొక్కా ఉంది క‌దా అని విర్ర‌వీగుతుంటారు. తాము ఏమీ చేసినా చెల్లుబాటు అవుతుంద‌ని బావిస్తుంటారు. ఓ మ‌హిళా పోలీసు కూడా ఇలాగే ప్ర‌వ‌ర్తించింది. త‌న ప్యాంటు పై ప‌డిన బుర‌ద‌ను ఓ వ్య‌క్తి చేత తుడిపించడమే కాకుండా స‌ద‌రు వ్య‌క్తి చెంప చెళ్లుమ‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. రేవా అనే ప్రాంతంలో ఓ యువ‌కుడు బైక్‌ను పార్క్ చేశాడు. తిరిగి త‌న బైక్‌ను వెన‌క్కి తీసే క్ర‌మంలో ప‌క్క‌నే ఉన్న మ‌హిళా పోలీసు పై బుర‌ద ప‌డింది. దీంతో ఆ పోలీసు ఆగ్ర‌హాంతో ఊగిపోయింది. పొర‌పాటున బుర‌ద ప‌డిన‌ప్ప‌టికీ.. త‌న ప్యాంటు మీద ప‌డిన‌ బుర‌దను శుభ్రం చేయాల‌ని యువ‌కుడిని బ‌ల‌వంతం చేసింది. చేసేది లేక ఆ యువ‌కుడు ప్యాంటుపై ప‌డిన బుర‌ద‌ను శుభ్రం చేశాడు.

అయిన‌ప్ప‌టికీ స‌ద‌రు మ‌హిళా పోలీసు కోపం చ‌ల్లార‌లేదు. వెళ్లే సమయంలో అత‌గాడిని చెంపదెబ్బ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న‌ను ఓ వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. వైర‌ల్‌గా మారింది. స‌ద‌రు మ‌హిళా పోలీసును కలెక్టర్ కార్యాలయంలో పని చేసే హోం గార్డు శశికళగా గుర్తించారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. స‌ద‌రు వీడియో త‌మ‌దాకా వ‌చ్చింద‌ని.. ఫిర్యాదు అందితే ఖ‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

Next Story