Video: ఆదివాసీపై మూత్ర విసర్జన ఘటన.. బాధుతుడి కాళ్లు కడిగిన సీఎం

గిరిజన యుకుడిపై మూత్రం పోసిన ఘటన మధ్యప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

By అంజి  Published on  6 July 2023 1:05 PM IST
Madhya Pradesh , CM Shivraj Singh Chouhan, Dashmat Rawat, Bhopal

Video: ఆదివాసీపై మూత్ర విసర్జన ఘటన.. బాధుతుడి కాళ్లు కడిగిన సీఎం

గిరిజన యుకుడిపై మూత్రం పోసిన ఘటన మధ్యప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిందితుడు ప్రవేశ్‌ శుక్లాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అటు ప్రభుత్వం నిందితుడి ఇంటిని కూల్చి వేసింది. తాజాగా బాధిత గిరిజన యువకుడిని సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ కలిశారు. బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణలు చెప్పారు. ఇవాళ బాధితుడిని భోపాల్‌లోని తన నివాసానికి పిలిపించుకున్న సీఎం శివరాజ్‌ సింగ్.. స్వయంగా బాధితుడి కాళ్లు కడిగారు.

అనంతరం అతడితో మాట్లాడారు. ఇలాంటి చర్యలను ఏ మాత్రం సహించేది లేదని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తనను ఎంతగానో బాధించిందన్నారు. ఈ విషయమై క్షమాపణలు కోరుతున్నానని, ప్రజలే తనకు దేవుడితో సమానం అని సీఎం అన్నారు. ఈ తరహా ఘటనలను సహించేదే లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి గౌరవం తన గౌరవమేనని పేర్కొన్నారు. నిందితుడు ప్రవేశ్ శుక్లా మానవత్వాన్ని మరిచి నీచంగా ప్రవర్తించాడని సీఎం చౌహన్ చెప్పారు. ఇది తీవ్రమైన నేరమని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించినట్లుగా చెప్పారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ఏడాది చివరలో ఎన్నికలు ఉన్నందునే సీఎం చౌహన్ బాధితుడి కాళ్లు కడిగారని కొందరు నెటిజన్లు అంటుండగా, మరి కొందరు సీఎం గొప్ప గుణాన్ని మెచ్చుకుంటున్నారు. కాగా ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితుడిపై పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఈ ఘటనను ప్రతిపక్షాలు ఖండించాయి. నిందితుడికి బీజేపీతో సంబంధం ఉందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ దాడులు మానవతకు సిగ్గుచేటని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. బీజేపీ విద్వేష సంస్కృతికి ఇది అద్దం పడుతోందన్నారు. అయితే కాంగ్రెస్‌ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది.

Next Story