మధ్యప్రదేశ్ బస్సు ప్రమాదం: 40కి చేరిన మృతుల సంఖ్య.. ప్రధాని దిగ్భ్రాంతి
Madhya Pradesh Canal Mishap. మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో బస్సులో ఉన్నవారు జలసమాధి అయ్యారు.
By Medi Samrat Published on 16 Feb 2021 5:04 PM ISTమధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో బస్సులో ఉన్నవారు జలసమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 28 మంది మృతి చెందినట్లు వార్తలు రాగా, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 40కి చేరింది. మంగళవారం ఉదయం సిధి జిల్లాలోని పట్నా గ్రామంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరిని కలచివేస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సహాయక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బస్సు పూర్తిగా కాల్వలో మునిగిపోవడంతో ఇంకొందరు గల్లంతయ్యారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం.
దీనిపై రేవా డివిజనల్ కమిషనర్ రాకేష్ జైన్ మాట్లాడుతూ.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఏడుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు చెప్పారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు చెప్పారు. సిధి జిల్లా కేంద్రం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహన డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఆయన పర్యటనను రద్దు చేసింది.
ప్రధాని, ఉప రాష్ట్రపతి తీవ్ర దిగ్భ్రాంతి
ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు ప్రధాని మోదీ. అలాగే గాయాలపాలైన వారికి రూ.50 వేల చొప్పున ప్రకటించారు.
ఘటన చాలా బాధించింది: అమిత్ షా
అలాగే ఈ ఘటన చాలా బాధించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఫోన్ వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.