దారుణం.. ట్రైనీ ఆర్మీ ఆఫీసర్లపై దాడి.. వారి స్నేహితరాలిపై అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 Sep 2024 4:02 AM GMTమధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటుచేసుకుంది. స్నేహితురాళ్లతో ఇద్దరు ట్రైనీ ఆర్మీ ఆఫీసర్లు ట్రిప్ కోసమని బయటకు వెళ్లారు. అక్కడ వారిని బెదిరించిన కొందరు దుండగులు.. ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి చేశారు. వారి దగ్గర ఉన్న సొత్తునంతా దోచుకున్నారు. అంతటితో ఆగకుండా ఆర్మీ అధికారుల వెంట ఉన్న స్నేహితురాళ్లలో ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఇండోర్‌లోని మోవ్ ఆర్మీ కాలేజ్‌లో ఇద్దరు యువ ఆర్మీ అధికారులు శిక్షణలో ఉన్నారు. అయితే.. వారు తమ ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి ఇండోర్‌లోనే తమ కాలేజ్‌కి దగ్గరలో ఉన్న ఒక పిక్నిక్ స్పాట్‌కు వెళ్లారు. అక్కడ కొంత మంది గుర్తు తెలియని వ్యక్తి వీరిని గమనించారు. వారి వద్దకు వెళ్లి బెదిరించారు. డబ్బులు.. నగలు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. అడ్డుకోబోయిన ఇద్దరు ఆర్మీ ట్రైనీ ఆఫీసర్లపై దాడికి తెగబడ్డారు. డబ్బును, నగలను దోచుకున్నారు. అంతటితో ఆగకుండా అక్కడున్న మహిళల్లో ఒకరిపై అత్యాచారం చేశారు. అయితే ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ఒక ట్రెయినీ ఆఫీసర్ ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు, ఆర్మీ ఉన్నతాధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వెళ్లే లోపే దుండగులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. బాధిత మహిళకు వైద్యపరీక్షలు చేశారు డాక్టర్లు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిపై గతంలో కొన్ని క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు గుర్తించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందనీ.. మిగతా వివరాలు విచారణ పూర్తయ్యాక చెబుతామని పోలీసులు వెల్లడించారు.