కొత్త వ్యాధి కలకలం.. లంపీ డిసీజ్‌తో ఆ రాష్ట్రంలోనే 12 వేల మూగజీవాలు మృతి

Lumpy skin disease Rajasthan government bans animal fairs.దేశంలో మ‌రో కొత్త వైర‌స్ వ‌ణికిస్తోంది. ఈ వ్యాధి ప్ర‌ధానంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2022 2:02 AM GMT
కొత్త వ్యాధి కలకలం.. లంపీ డిసీజ్‌తో ఆ రాష్ట్రంలోనే 12 వేల మూగజీవాలు మృతి

దేశంలో మ‌రో కొత్త వైర‌స్ వ‌ణికిస్తోంది. ఈ వ్యాధి ప్ర‌ధానంగా ప‌శువుల‌కే వ్యాపిస్తోంది. రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ రాష్ట్రాలు లంపీ చర్మవ్యాధి కార‌ణంగా అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా ఒక్క రాజ‌స్థాన్‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు 12 వేల‌కు పైగా మూగ‌జీవాలు మృత్యువాత ప‌డ్డాయి. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వ‌హించే ప‌శువుల సంత‌పై నిషేదం విధించింది.

రాజస్థాన్‌లో ఇప్పటివరకు మొత్తం 2,81,484 పశువులకు లంపీ చర్మవ్యాధి సోకగా వాటిలో 2,41,685 పశువులకు చికిత్స అందించారు. ఆగస్టు 10 నాటికి 12,800 పశువులు మృతి చెందాయి. శ్రీ గంగానగర్‌లో అత్యధికంగా 2511 పశువులు మరణించ‌గా.. బార్మెర్‌లో 1619, జోధ్‌పూర్‌లో 1581, బికనెర్‌లో 1156, జరోల్‌లో 1150 పశువులు ప్రాణాలు కోల్పోయాయి. రాష్ట్రంలోని ఈ ఐదు జిల్లాల్లోనే వ్యాధి తీవ్రంగా ఉంద‌ని, అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని రాజ‌స్థాన్ ప‌శుసంవ‌ర్థ‌క శాఖ కార్య‌ద‌ర్శి పీసీ కిష‌న్ తెలిపారు. ఈ వ్యాధి వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు.

ఈ వ్యాధి ఒక్క రాజ‌స్థాన్ రాష్ట్రానికే ప‌రిమితం కాలేదు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్‌, గుజ‌రాత్‌, ఉత్త‌రాఖండ్‌, అండ‌మాన్ నికోబార్‌లోనూ లంపీ చర్మవ్యాధి కార‌ణంగా వంద‌ల సంఖ్య‌లో ప‌శువులు మ‌ర‌ణించిన‌ట్లు ఆయా ప్ర‌భుత్వాలు వెల్ల‌డిస్తున్నాయి.

లంపీ స్కిన్‌ వ్యాధి అంటే..?

గోట్‌పాక్స్‌, షీప్‌పాక్స్‌ కుటుంబానికి చెందిందే లంపీ స్కిన్ వ్యాధి. ఇది ప‌శువుల్లో కాప్రిపాక్స్‌వైరస్‌ కారణంగా వ‌స్తుంది. ఈ వైరస్‌ సోకిన పశువుల చ‌ర్మంపై గ‌డ్డ‌లు ఏర్ప‌డ‌డంతో పాటు జ్వరంతో బాధ‌ప‌డుతుంటాయి. వాటిపై రక్తాన్ని పీల్చే దోమలు, పురుగులు వాలి కుట్టినప్పుడు తీవ్ర రక్తస్రావం జ‌రుగుతుంది. దీంతో కొన్ని రోజుల్లోనే ప‌శువులు బ‌రువు కోల్పోవ‌డంతో పాటు పాల‌దిగుబ‌డి తగ్గుతుంది. వీటికి తోడు శ్వాస, లాలాజల స్రావాలు కూడా మరింత ఎక్కువై పశువుల మరణానికి దారితీస్తుంది.

కాగా.. దీనికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చికిత్స లేదు. వ్యాధి నుంచి ప‌శువుల‌కు ఉప‌శ‌మ‌నం పొందెందుకు యాంటీబ‌యోటిక్స్ ఉప‌యోగిస్తున్నారు. ఇటీవ‌ల భార‌త వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న మండ‌లి(ఐసీఏఆర్‌) చెందిన రెండు సంస్థ‌లు స్వ‌దేశీ టీకాల‌ను అభివృద్ది చేశాయి. ఈ టీకాల‌ను త్వ‌ర‌లోనే ఉత్ప‌త్తి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక రూపొందిస్తోంది.

Next Story