అందరూ అని చెప్పలేం గానీ కొద్ది మంది అధికారులు తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. రైల్వేకు చెందిన స్థలంలో ఆంజనేయస్వామి గుడి ఉందని గుర్తించిన అధికారులు వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఏకంగా స్వామి వారికి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని వెంటనే ఖాళీ చేయాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
మొరెనా జిల్లాలోని సబల్‌గఢ్ ప్రాంతంలో రైల్వే బ్రాడ్ గ్రేజ్ పనులు జరుగుతున్నాయి. రైల్వేకు చెందిన స్థలంలో ఆంజనేయ స్వామి గుడి ఉందని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని వెంటనే ఖాళీ చేయాలని లేకపోతే చర్యలు తీసుకుంటామంటూ ఏకంగా బజరంగబలి పేరిటే నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లో ఆక్రమణను తొలగించాలని సూచించారు. అలా కానీ పక్షంలో రైల్వే శాఖ చర్యలు తీసుకుంటే అందుకు అయ్యే ఖర్చును కూడా మీరే భరించాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నోటీసు వైరల్ కావడంతో పొరబాటును గుర్తించిన అధికారులు తప్పును సరిదిద్దుకుని ఆలయ పూజారి పేరు మీద కొత్త నోటీసు జారీ చేసింది. దీనిపై ఝాన్సీ రైల్వే డివిజన్ యొక్క PRO (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) మనోజ్ మాథుర్ మాట్లాడుతూ.. ప్రాథమిక నోటీసు పొరపాటుగా అందించబడింది. ఇప్పుడు కొత్త నోటీసు ఆలయ పూజారికి అందించబడిందని ఆయన చెప్పారు.