ఇకపై ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నరే సుప్రీం..!

Lok Sabha passes bill that seeks to clarify that govt in Delhi.దేశ రాజధాని ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నరే సుప్రీం అని స్పష్టతనిచ్చే కీలక బిల్లును బుధవారం రాజ్యసభ ఆమోదించింది.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 25 March 2021 10:25 AM IST

Lok Sabha passes bill that seeks to clarify that govt in delhi

దేశ రాజధాని ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నరే సుప్రీం అని స్పష్టతనిచ్చే కీలక బిల్లును బుధవారం రాజ్యసభ ఆమోదించింది. విపక్షాల నిరసనలు, అరుపులు, వాకౌట్ల మధ్య నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్ మెంట్) బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వంకన్నా లెఫ్టినెంట్‌ గవర్నర్‌దే అంతిమాధికారం అని చెప్పే ఈ బిల్లు ఆమోదం సందర్భంగా బుధవారం రాజ్యసభలో హైడ్రామా నడిచింది. బిల్లును వ్యతిరేకిస్తూ పలు ప్రతిపక్షాలు ఆందోళనచేశాయి. ఎస్‌పీ, కాంగ్రెస్, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల ఎంపీలు వాకవుట్‌ చేశారు.

ద గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్‌సీటీడీ) ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్ట్‌నెంట్‌ గవర్నరే!. అంటే ఈ బిల్లు ప్రకారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వేటికైనా ఎల్జీ ఆమోదం తప్పనిసరి. ముందుగా బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా వాదనలు జరిగాయి. ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు విపక్షాలు గట్టిగా ఎదిరించాయి. ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వాదించాయి. బిల్లును తొలుత సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశాయి. అయితే బిల్లుతో ఢిల్లీలో బలమైన ప్రభుత్వయంత్రాంగం ఏర్పడుతుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి చెప్పారు. 1991లో తెచ్చిన చట్టంలోని సందిగ్ధతలు తొలగించేందుకే ఈ బిల్లు తెచ్చామన్నారు. సుప్రీంకోర్టు గతంలో చెప్పిన తీర్పుల సారాంశానికి అనుగుణంగానే మార్పులు చేశామని వివరించారు.


పార్లమెంటు ఉభయసభలు బిల్లుకు ఆమోదముద్ర వేయడంతో... దీన్ని రాష్ట్రపతి వద్దకు పంపనున్నారు. ఆయన సంతకం చేసిన తర్వాత ఇది చట్టరూపం దాలుస్తుంది. ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు పూర్తిగా తగ్గిపోనున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యనిర్వాహక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి తలెత్తుతుంది


Next Story