రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ లాక్‌డౌన్ తప్పదని, ఈ దిశగా ఆలోచిస్తున్నామని మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. కరోనాను ఎదుర్కోడానికి ఈ నిర్ణయం తప్పదని పేర్కొన్నారు. గురువారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆయన కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వ్యాక్సిన్ విషయంలో భయపడాల్సిన పనేలేదని ఉద్ధవ్ స్పష్టం చేశారు. అర్హులైన వారందరూ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. అలాగే.. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తాం. అయితే మొదట్లోనే ఇది చేసి ఉండాల్సింది. పరిస్థితి మాత్రం అదుపులోనే ఉంది. కొన్నిచోట్ల కఠినమైన లాక్‌డౌన్‌ను విధిస్తాం. త్వరలోనే ఈ నిర్ణయం తీసుకుంటామని ఉద్ధవ్ థాకరే అన్నారు.
ఇదిలావుంటే.. మహరాష్ట్రలో కొత్తగా 13,659 కేసులు నమోదవగా.. 9,913 మంది కరోనా నుండి కోలుకున్నారు. మహమ్మారి ధాటికి 54 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇంకా 99,008 యాక్టివ్ కేసులు ఉన్నాయని బుధవారం మహరాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.