మళ్లీ లాక్‌డౌన్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు

Lockdown Imposed in Nagpur. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్ విధించనున్నారు.

By Medi Samrat  Published on  11 March 2021 11:04 AM GMT
Lockdown Imposed in Nagpur

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి దేశంలోని పలు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నాయి. ఇక దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అక్కడ ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్ విధించనున్నారు. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌లో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మార్చి 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

అత్యవసర షాపులు మినహా..

కేవలం నిత్యావసరాల షాపులు, మెడికల్‌ షాపులు మినహా ఇతర షాపులన్నీ మూసి ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నాగ్‌పూర్‌లో బుధవారం ఏకంగా 1710 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, అలాగే భౌతిక దూరం పాటించాలని సూచించారు. మాస్కులు ధరించకుండా కనిపించినట్లయితే జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

అలాగే నిత్యావసర సరుకులు అమ్మే షాపులు మినహా ఇతర దుకాణాలన్నీ సాయంత్రం 7 గంటల్లోపు మూసివేయాలని, శని, లేదా ఆదివారం ఏదో ఒక రోజు తప్పనిసరి షాపులు మూసే ఉంచాలన్నారు. అలాగే రాత్రి 9 గంటల తర్వాత నిత్యావసర సరుకులు అమ్మే దుకాణాలు కూడా తెరవకూడదని సూచించారు.

కాగా, అటు ముంబై నగరంలో కోవిడ్‌-19 కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బీఎంసీ పరిధిలో 1500కిపైగా కొత్త కేసులు నమోదు కావడంతో అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.


Next Story