ప్రస్తుత సమాజంలో కనబడకుండా కొనసాగుతున్న సహజీవనంపై పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సహజీవనం అనేది సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. అంతే కాదు సహజీవనం చేస్తున్న జంటకు వారి తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించేందుకు నిర్మొహమాటంగా నిరాకరించింది. తార్న్ తరన్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల గుల్జా కుమారి, 22 ఏళ్ల గుర్విందర్ సింగ్ హర్యానా కోర్టుకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. తాము ప్రేమించుకున్నామని, ఈ క్రమం లోనే కలిసి నివసిస్తున్నామని, త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నామన్నారు. అయితే గుల్జా కుమారి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్సించాల్సిందిగా కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
అయితే ఇలాంటి జంటకు రక్షణ కల్పించాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని న్యాయస్థానం తెలిపింది. ఎందుకంటే, సహజీవనం అనేది సామాజికంగా, నైతికంగా అంగీకరించేది కాదని జస్టిస్ హెచ్ఎస్ మదాన్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సహజీవనం చేస్తున్న జంటలకు రక్షణ కల్పించడం అంటూ మొదలు పెడితే సమాజంలోకి చాలా తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని, వ్యవస్థలో సరికొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.