దేశంలో ఎల్లుండి నుంచే జనగణన..సహజీవన జంటలపై కేంద్రం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 2027 జనగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది

By -  Knakam Karthik
Published on : 30 March 2026 2:21 PM IST

National News, Census2027, Indian Government, Live In Relationships, Family Status, Digital Census

దేశంలో ఎల్లుండి నుంచే జనగణన..సహజీవన జంటలపై కేంద్రం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 2027 జనగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా సహజీవనం (Live-in relationship) చేస్తున్న జంటలు తమ బంధం స్థిరమైనదని భావిస్తే, వారిని కూడా 'కుటుంబం'గా పరిగణించాలని నిర్ణయించింది.

ఈ మేరకు రాబోయే జనాభా గణన నిబంధనల్లో స్పష్టతనిస్తూ, వివాహిత జంటలతో పాటు సహజీవన జంటల వివరాలను కూడా నమోదు చేయనున్నారు. 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరిగే తొలి దశ 'ఇళ్ల జాబితా నమోదు, గృహ గణన'లో భాగంగా అధికారులు ప్రజలను 33 రకాల ప్రశ్నలు అడగనున్నారు. ఇందులో ఇంటి యజమాని వివరాలు, నిర్మాణ సామగ్రి, తాగునీరు, విద్యుత్, ఇంటర్నెట్, వాహనాల వినియోగంతో పాటు కుటుంబం తీసుకునే ప్రధాన ఆహార ధాన్యాల గురించి కూడా సమాచారాన్ని సేకరిస్తారు.

ఈసారి జనగణనను డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తుండటం విశేషం; ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు 'సెల్ఫ్-ఎన్యూమరేషన్' పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. 2027 ఫిబ్రవరిలో రెండో దశ జనాభా గణన ప్రారంభం కానుండగా, అత్యంత కీలకమైన కుల గణన అంశంపై ఈ లోపే ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

Next Story