దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. దీంతో వాహనదారులు తమ వాహనాలను బయటకు తీసేందుకే జంకుతున్నారు. పెట్రోలు ధర సెంచరీలు కొట్టేస్తున్న ఈ రోజుల్లో లీటర్ పెట్రోలు కేవలం ఒకే ఒక్క రూపాయికి ఇస్తుంటే జనాలు క్యూలు కట్టేయకుండా ఉంటారా? ఏంటీ లీటర్ పెట్రోలు రూపాయికా? అనే షాక్ అయ్యే రోజులు మరి ఇవి. మహారాష్ట్రలోని ఓ పెట్రోల్ బంకులో లీటరు పెట్రోలు రూపాయికే పోస్తున్నారు అని తెలిసి జనాలు కిలోమీటర్ల కొద్ది క్యూ కట్టారు.
మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టిన రోజు సందర్భంగా డోంబివలీ యువసేన ఆదివారం రూపాయికే లీటర్ పెట్రోల్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఠాణేలోని ఓ పెట్రోల్ బంకులో ఈ అవకాశాన్ని కల్పించింది. విషయం తెలిసిన వాహనదారులు బారులు తీరారు. బంకు ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. మరోవైపు అమర్నాథ్ వింకో నకాలోని ఓ పెట్రోల్ బంకులో రూ.50కి లీటర్ పెట్రోల్‌ను అందించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు వచ్చిన వారికే ఈ అవకాశం కల్పించారు.