కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ మూగ జీవాలను కూడా వదలడం లేదు. తాజాగా కరోనాతో ఓ సింహం మరణించింది. ఈ ఘటన తమిళనాడులోని వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో చోటు చేసుకుంది. ఐదు రోజుల క్రితం సింహం అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు పరీక్షించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టింగ్ నిమిత్తం శాంపిల్స్ భోపాల్ లోని ల్యాబ్ కి పంపారు. రిపోర్ట్స్ లో పాజిటివ్ గా నిర్దారణ అయింది.
అక్కడే ఉన్న ఇతర సింహాల శాంపిళ్లు కూడా పాజిటివ్‌గా తేలినట్లు జూ సిబ్బంది వెల్లడించారు. జూలో ఉన్న 9 ఇతర సింహాలకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. అయితే వాటికి కరోనా ఎలా సోకిందన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే సింహం దీర్ఘకాల వ్యాధులతో చనిపోయి ఉండొచ్చని ఓ జూ అధికారి చెప్పారు. రెండో శాంపిల్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజ్‌స్‌కు పంపిస్తామని తెలిపారు. కాగా.. గత నెలలో హైదరాబాద్ లోని జూలో కూడా 8 సింహాలకు కరోనా వైరస్ సోకింది. దీంతో సింహాలకు ఏ విధంగా చికిత్స అందిస్తున్నారో హైదరాబాద్ జూ అధికారులను అడిగి తెలుసుకున్నారు