విద్యుత్ లైన్‌మెన్‌కు ట్రాఫిక్ పోలీసుల జరిమానా విధిస్తే.. ఏమవుతుందో ఈ ఘటన ఓ ఉదాహరణ. ఆగ్రహించిన లైన్ మెన్ ఆ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మెహతాబ్ అనే వ్యక్తి విద్యుత్ కాంట్రాక్ట్ లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అతడు బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపారు. హెల్మెట్ ధరించకపోవడాన్ని ప్రశ్నించారు. తాను విద్యుత్ లైన్‌మెన్ అని, మరోసారి హెల్మెట్ లేకుండా వెళ్లనంటూ చెప్పాడు. అయితే వారి మధ్య గొడవ కాస్తా ఎక్కువైంది. మాటా మాటా పెరిగి అధిక విద్యుత్ బిల్లులతో ప్రజలను వేధిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు అతడితో అన్నారు. ఆ లైన్‌మెన్‌కు రూ.6,000 జరిమానా విధిస్తూ చలానా ఇచ్చారు.
మరోవైపు దీనిపై లైన్‌మెన్ మోహతాబ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరో సిబ్బందితో కలిసి థానా భవన్ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. ఆ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని విద్యుత్ అధికారులు కూడా సమర్థించారు. వేలల్లో విద్యుత్ బిల్లుల బకాయిలున్నట్లు పేర్కొన్నారు. అయితే పోలీస్ అధికారులు దీనిపై స్పందించలేదు. ఆ లైన్‌మెన్ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యూపీలో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే ట్రాఫిక్ పోలీసులు రూ.2,000 జరిమానా విధిస్తారు. అయితే రూ.5,000 వేతనం అందుకునే కాంట్రాక్ట్ లైన్‌మెన్ మెహతాబ్‌కు రూ.6,000 జరిమానా ఎందుకు విధించారో తెలియాల్సి ఉంది.