ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కు చేయాల్సిన ప్రయోగం వాయిదా పడిందని ఆక్సియం స్పేస్ ధృవీకరించింది. అయితే మే 29న ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా దానిని జూన్ 8వ తేదీకి మార్చినట్లు అమెరికాకు చెందిన వాణిజ్య మానవ సహిత అంతరిక్షయాన సంస్థ యాక్సియమ్ స్పేస్, నాసా సంయుక్తంగా ప్రకటించాయి. భారత కాలమానం ప్రకారం జూన్ 8న సాయంత్రం 6:41 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ఫ్లైట్ షెడ్యూల్‌ను సమీక్షించిన అనంతరం నాసా, దాని భాగస్వామ్య సంస్థలు రాబోయే కొన్ని మిషన్ల ప్రయోగ తేదీలలో మార్పులు చేసినట్లు వెల్లడించాయి. "కార్యకలాపాల సంసిద్ధతను బట్టి, యాక్సియమ్ మిషన్ 4 ప్రయోగానికి కొత్త తేదీ జూన్ 8, ఉదయం 9:11 (తూర్పు అమెరికా కాలమానం)" అని నాసా తన ఎక్స్ ఖాతాలో తెలిపింది.
2,000 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉన్న పైలట్ శుక్లా 2019 లో భారతదేశ వ్యోమగామి కార్యక్రమానికి ఎంపికయ్యారు. రష్యా, భారతదేశం, యూఎస్‌లలొ విస్తృతమైన శిక్షణ పొందారు. ప్రపంచ మానవ అంతరిక్ష ప్రయాణంలో కీలక పాత్ర పోషించాలనే మరియు 2027లో జరగనున్న దేశంలోని మొట్టమొదటి స్వదేశీ సిబ్బందితో కూడిన మిషన్ గగన్‌యాన్‌కు సిద్ధం కావాలనే భారతదేశ ఆశయాలలో Ax-4 మిషన్‌లో ఆయన పాల్గొనడం ఒక కీలకమైన అడుగుగా పరిగణించబడుతుంది.