మరింత క్షీణించిన లాలూ ఆరోగ్యం.. శరీరంలోని పలు అవయవాల పనితీరు దెబ్బతిన్నాయి
Lalu Yadav Latest Health Update. లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి మరింత విషమమైందని న్యూఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.
By Medi Samrat Published on 24 Jan 2021 8:00 AM GMT
లాలూ ప్రసాద్ యాదవ్.. పరిచయం అక్కర లేని పేరు. ఇటీవల ఆయన ఆసుపత్రి పాలవ్వగా.. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని వైద్యులు తెలిపారు. దాణా స్కామ్ లో ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి మరింత విషమమైందని న్యూఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. రాంచీ ఆసుపత్రిలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, న్యూఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఆయన శరీరంలోని పలు అవయవాల పనితీరు దెబ్బతినడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైద్య వర్గాలు తెలిపాయి. కిడ్నీ సమస్యలకు తోడు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆయన బాధపడుతున్నారని, ఆయన కిడ్నీలు కేవలం 20 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని వైద్య వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యం విషమించడంతో బీహార్ లో పోలీసు బందోబస్తును పెంచారు.
ఏడేళ్ల పాటు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఐదేళ్ల పాటు ఆయన కేంద్ర రైల్వే శాఖా మంత్రిగానూ సేవలందించారు. 2017 డిసెంబర్ లో ఆయనకు 7 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన అత్యధిక కాలం జైల్లోనే గడిపారు. పెరోల్, అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో బందోబస్తు మధ్య గడిపారు. తాను సీఎంగా ఉన్న కాలంలో పశువులకు దాణా నిమిత్తం జరిపిన కొనుగోళ్లపై అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు నిరూపితమైన సంగతి తెలిసిందే. రూ. 3.50 కోట్లను ఆయన అక్రమంగా ప్రభుత్వ నిధుల నుంచి విత్ డ్రా చేశారన్న అభియోగాలు రుజువయ్యాయి. ఆయనపై మరికొన్ని కేసులూ నిరూపితం అయ్యాయి. వీటన్నింటిలో విధించబడిన శిక్షను ఆయన ఏకకాలంలో అనుభవిస్తున్నారు.