యూపీ ఎన్నికలు : నోటా ఆప్షన్‌ను ఉపయోగిస్తామంటున్న లఖింపూర్ ఖేరీ రైతులు..
Lakhimpur Kheri farmers to use NOTA option. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయమై లఖింపూర్ ఖేరీ రైతులు
By Medi Samrat Published on 2 Feb 2022 5:03 AM GMTత్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయమై లఖింపూర్ ఖేరీ రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులంతా నోటాకు వేసి తమ ఓటు హక్కును వినియోగించాలని నిర్ణయించుకున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 3న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందిన ఎస్‌యూవీ వాహనం నలుగురు రైతులను ఢీకొట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఇంకా స్పష్టత రాకపోవడంతో రైతులు.. రాజకీయ పార్టీలు తమను మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
"కొన్ని పార్టీలు మమ్మల్ని మోసం చేశాయి, మరికొన్ని పనికిరానివిగా నిరూపించబడ్డాయి" అని స్థానిక రైతు గుర్విందర్ సింగ్ అన్నారు. బీజేపీ, ఎస్పీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తమకు తప్పుడు హామీలిచ్చి ఎన్నికల సమయంలో మమ్మల్నే సరుకులుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని.. మాకు ఏ రాజకీయ పార్టీపై ఆశ లేదని రైతులు అంటున్నారు.
అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలోని టికునియా గ్రామంలో రైతుల నిరసన సందర్భంగా జరిగిన హింసలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది చనిపోయారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా జైలులో ఉన్నాడు.
రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్ అధినేత వి.ఎం. సింగ్ నేత మాట్లాడుతూ.. ఎస్పీ, బీజేపీలు రైతులను మోసం చేశాయని ఆరోపించారు. టెరాయ్ బెల్ట్‌లో ఉన్న లఖింపూర్ ఖేరీ జిల్లా జనాభాలో అత్యధికంగా రైతులు ఉన్నారు. అక్టోబర్ 3 ఘటన తర్వాత తాము బీజేపీకి మద్దతివ్వబోమని.. రైతులకు చెరుకు మిల్లుల యజమానులు చెల్లించాల్సిన రూ.2000 కోట్ల వడ్డీని మాఫీ చేసిన సమాజ్‌వాదీ పార్టీకి కూడా మద్దతివ్వడం లేదన్నారు. కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966 ప్రకారం.. 14 రోజుల్లోగా బకాయి ఉన్న చెరుకుకు ధర చెల్లించకపోతే.. చక్కెర మిల్లు యజమానులు రైతులకు 15 శాతం వడ్డీ చెల్లించాలి. అయితే, అప్పటి ఎస్పీ ప్రభుత్వం ఈ వడ్డీ మొత్తాన్ని మాఫీ చేసింది.
లఖింపూర్ ఖేరీ జిల్లాలో 75 శాతం మంది రైతులు చెరకు సాగు చేస్తున్నారు. సహకార సంస్థలు, ప్రైవేట్ రంగాల ఆధ్వర్యంలో నడిచే తొమ్మిది చక్కెర కర్మాగారాలు ఇక్కడ సుమారు 15 లక్షల క్వింటాళ్ల చెరకును క్రష్ చేస్తున్నాయి. మరో రైతు రాజ్ సింగ్ మాట్లాడుతూ.. మా పిల్లలు చదువుకోలేకపోతున్నారు, పెళ్లిళ్లు చేసుకోలేకపోతున్నాం.. ఏ పార్టీకి ఓటేయాలని కోరుకోవడం లేదని, నోటా ఆప్షన్‌ను ఉపయోగిస్తామని చెప్పారు.
17 ఓబీసీ కులాలను షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి మార్చాలన్న తమ డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చనందున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సభ్యులు.. ఏ అభ్యర్థికి ఓటు వేయబోమని షామ్లీ జిల్లాలోని కశ్యప్ కమ్యూనిటీకి చెందిన పంచాయతీ గతంలో ప్రకటించింది.