భారత్‌లో కువైట్ మహిళ అదృశ్యం.. బంగ్లాదేశ్‌లో ఆచూకీ లభ్యం

Kuwaiti woman goes missing in India, found in Bangladesh. కువైట్‌కు చెందిన 31 ఏళ్ల మహిళ చికిత్స కోసం భారతదేశానికి వచ్చి గత నెలలో కోల్‌కతా నగరంలో

By అంజి  Published on  9 Feb 2023 5:08 PM IST
భారత్‌లో కువైట్ మహిళ అదృశ్యం.. బంగ్లాదేశ్‌లో ఆచూకీ లభ్యం

కువైట్‌కు చెందిన 31 ఏళ్ల మహిళ చికిత్స కోసం భారతదేశానికి వచ్చి గత నెలలో కోల్‌కతా నగరంలో అదృశ్యమైంది. తాజాగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో ఆ మహిళ కనిపించిందని పోలీసు అధికారి గురువారం తెలిపారు. మొదట మహిళ కోల్‌కతా గాలింపు చర్యలు చేపట్టారు. క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తర్వాత, కోల్‌కతా పోలీసులు కువైట్ ఎంబసీకి సమాచారం అందించారు. ఒక వ్యక్తితో పాటు మహిళ బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించడానికి అంతర్జాతీయ సరిహద్దును దాటిందని తెలిసింది. ఆ తర్వాత కువైట్ రాయబార కార్యాలయం బంగ్లాదేశ్ సహాయం కోరింది. సోమవారం ఆ దేశంలోని ఒక ఇంటి నుండి మహిళ కనుగొనబడింది. అక్కడి పోలీసులు ఆమెను కువైట్ అధికారులకు అప్పగించారు అని పోలీసు అధికారి తెలిపారు.

సదరు మహిళ జనవరి 20న తన తమ్ముడితో కలిసి కోల్‌కతాకు వచ్చి తూర్పు కోల్‌కతాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉంచింది. కొన్ని చర్మ సంబంధిత సమస్యలతో ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కోల్‌కతాలోని ఇతర పర్యాటక ఆకర్షణలను సందర్శించిన తర్వాత, ఆమె తన తమ్ముడితో కలిసి జనవరి 27న అలీపూర్ జంతుప్రదర్శనశాలకు వెళ్లి అక్కడ నుండి తప్పిపోయిందని" అధికారి తెలిపారు. ఆమె సోదరుడు అలీపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కువైట్ సిమ్ ఉన్న ఆమె మొబైల్ ఫోన్ ట్రాక్ కాకపోవడంతో, పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడం ప్రారంభించారు. ''సీసీటీవీ ఫుటేజీలో ఆమె సూట్, క్యాప్, మాస్క్ ధరించిన వ్యక్తితో పసుపు రంగు టాక్సీలో ఎక్కినట్లు చూపించింది. దీంతో అతన్ని గుర్తించడం చాలా కష్టం. చివరకు మేము టాక్సీ డ్రైవర్‌ను గుర్తించాము. వారు మార్క్విస్ స్ట్రీట్ (సెంట్రల్ కోల్‌కతాలో) సమీపంలో దిగినట్లు తెలుసుకున్నాము'' అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అక్కడి నుంచి మరో టాక్సీలో బంగ్లాదేశ్ సరిహద్దుకు పొరుగున ఉన్న నార్త్ 24 పరగణాల జిల్లాలోని బంగాన్ సమీపంలోకి చేరుకున్నారు.

ఆ తర్వాత మహిళ ఆచూకీ ఎక్కడా లభించలేదు. మహిళ సోదరుడి వివరణ ఆధారంగా, వందలాది సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత బంగ్లాదేశ్‌ జాతీయుడైన వ్యక్తి ఫొటో తమకు లభించిందని అధికారి తెలిపారు. ఆ వెంటనే ఆ వ్యక్తిపై రెడ్ అలర్ట్ ప్రకటించారు. కోల్‌కతా పోలీస్‌లోని అలీపూర్ పోలీస్ స్టేషన్, యాంటీ రౌడీ సెక్షన్ సిబ్బందికి.. చివరకు వారు అంతర్జాతీయ సరిహద్దును దాటినట్లు స్పష్టంగా తెలిసింది. దీంతో న్యూఢిల్లీలోని కువైట్ ఎంబసీకి సమాచారం అందించారు. మహిళను రక్షించడంలో తమ అధికారుల పాత్రను ప్రశంసిస్తూ ఎంబసీ కోల్‌కతా పోలీసులకు ప్రశంసా పత్రాన్ని పంపిందని అధికారి తెలిపారు.

Next Story