అయిదు రాష్టాల్లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! దీంతో ఆయా రాష్ట్రాల్లో పలు పార్టీలు ప్రజల మీదకు హామీలను గుప్పిస్తూ ఉన్నాయి.కేరళరాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు పెద్దగా లేకపోయినప్పటికీ.. ఆ పార్టీ హామీలను చూసి ప్రజలు నివ్వెరబోతున్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే పెట్రోల్ ను 60 రూపాయలకే అందిస్తామని అంటున్నారు. భారతదేశంలో ప్రస్తుతం పెట్రోల్ ధర 100 రూపాయల మార్కును తగిలింది. కానీ కేరళ బీజేపీ పార్టీ మాత్రం 60 రూపాయలకే అధికారంలోకి రాగానే ఇస్తామని చెబుతోంది.
కేరళలో తాము అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్ 60 రూపాయలకే విక్రయిస్తామని కేరళ బీజేపీ గురువారం హామీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి చేరుస్తామని బీజేపీ సీనియర్ నేత కుమ్మనం రాజశేఖరన్ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి కేరళ లోని లెఫ్ట్ సర్కార్ ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది బీజేపీ సర్కారు అయితే ఆ పని ఎందుకు చేయడం లేదో చెప్పాలని ఇతర పార్టీలు రాజశేఖరన్ కు కౌంటర్ వేస్తున్నాయి.