Kshatriya Panchayat Said Girls Should Not Wear Jeans. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌కు చెందిన క్షత్రియ పంచాయతీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అమ్మాయిలు జీన్స్ ధరించవద్దని
By Medi Samrat Published on 10 March 2021 11:50 AM GMT
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌కు చెందిన క్షత్రియ పంచాయతీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అమ్మాయిలు జీన్స్ ధరించవద్దని క్షత్రియ పంచాయతీ తీర్మానించింది. గతంలో ఇతర ప్రాంతాల్లో ఇలాంటి నిబంధనలు అమలు చేసిన సంగతి తెలిసిందే. అమ్మాయిలు జీన్స్ ధరించినట్లయితే.. వారిపై సంఘ బహిష్కరణ చేస్తామని హెచ్చరించడం గమనార్హం. ప్రస్తుత రోజుల్లో అందరూ కామన్ వేసుకునే డ్రెస్ జీన్స్. అమ్మాయి, అబ్బాయి, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ జీన్స్ వేసుకుంటున్నారు. అందరికీ చాలా కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. అమ్మాయిల విషయమే కాదు.. అబ్బాయిలు నిక్కర్లు వేసుకోవద్దని, తీర్మానం ఉల్లంఘించిన వారికి ఇదే జరిమాన ఉంటుందని క్షత్రియ పంచాయతీ తేల్చిచెప్పింది.
అమ్మాయిలు జీన్స్ ధరించి తిరుగుతుండటం వల్ల వేధింపులు ఎక్కువవుతున్నాయని క్షత్రియ పంచాయతీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా దేశంలో ఎక్కువగా అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయి.. దానికి కారణం అమ్మాయిలు ధరిస్తున్న వస్త్రాలే అని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే అమ్మాయిలు జీన్స్ ధరించకుండా చూస్తే బాగుంటుందని కొందరు చేసిన సూచనల మేరకు మంగళవారం క్షత్రియ పంచాయతీ సమావేశమై దీనిపై చర్చించి ఈ మేరకు ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలుచేయనున్నట్లు ప్రకటించింది.
క్షత్రియ కులం గౌరవ మర్యాదలను పెంపొందించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని క్షత్రియ పంచాయతీ పెద్దలు తెలిపారు. క్షత్రియ కులం గౌరవ మర్యాదలను పెంపొందించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు ధరించాలని, ప్రస్తుతం పంచాయతీ చేసిన తీర్మానం ప్రకారం కట్టుబడి ఉండాలని, ఎక్కవసార్లు పట్టుబడితే మాత్రం సంఘ బహిష్కరణ చేసేందుకు కూడా తాము వెనుకాడమని స్పష్టం చేస్తున్నారు.