ఆ కుటుంబానికి 36 ఏళ్ల తర్వాత విద్యుత్ కనెక్షన్ వచ్చింది
Kolkata family gets electricity connection after 36 years. గత 36 సంవత్సరాలుగా.. ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత ఆమె ఇల్లు చీకటిలోనే ఉండిపోయింది.
By అంజి Published on 7 Jan 2023 2:38 PM GMTగత 36 సంవత్సరాలుగా.. ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత ఆమె ఇల్లు చీకటిలోనే ఉండిపోయింది. సకీనా షేక్ కుటుంబం తమ మొబైల్ ఫోన్‌లకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇరుగుపొరుగు వారిపైనే ఆధారపడాల్సి వచ్చింది. అయితే ఆ ఇల్లు పశ్చిమ బెంగాల్‌లోని ఏదో ఒక సుదూర గ్రామంలో లేదు.. కోల్‌కతా నగరంలోనే ఉంది. వేసవి వేడికి బయటకు వెళ్లిన వారు ఇంటికి తిరిగి రావడంతోనే ఫ్యాన్ లేదా ఎయిర్ కండీషనర్ ఆన్ చేయడం చాలా మందికి కొత్త కాదు, ముఖ్యంగా కోల్‌కతా వంటి మెట్రో నగరంలో నివసించే వారికి.
కానీ సకీనా షేక్ కుటుంబంలో అలా జరగలేదు. గారియాలోని బ్రహ్మపూర్ పరిసరాల్లో నగరం దక్షిణ అంచులలో ఉన్న ఆమె ఇల్లు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) ప్రత్యక్ష అధికార పరిధిలోకి వస్తుంది. గత 36 సంవత్సరాలుగా.. ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత, ఆమె ఇల్లు చీకటిలో ఉండిపోయింది. ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు. ఏకంగా మూడు దశాబ్దాల పాటు. ఆ ఇంట్లో మూడు దశాబ్దాలుగా వారికి విద్యుత్ కనెక్షన్ లేదు. దీనికి కారణం విద్యుత్ కోత కాదు.
36 ఏళ్లుగా కరెంటు కనెక్షన్ లేని సకీనా షేక్ దంపతుల కథ ఇది
ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యుత్తు కనెక్షన్ పొందే స్థోమత లేదు. కానీ సంవత్సరాలు గడిచేకొద్దీ కరెంటు లేకుండా జీవించడం చాలా కష్టమని వారు గ్రహించారు. బహుశా అదృష్టం వల్ల కొన్ని రోజుల క్రితం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ బ్రహ్మపూర్ సందర్శించారు. మంత్రి వద్దకు వెళ్లే ముందు కాస్త భయపడిపోయినా సకీనా తనకు ఎదురైన బాధను వివరించింది. అది విని బిశ్వాస్ అవాక్కయ్యాడు. ఆ కుటుంబానికి కరెంటు కనెక్షన్ ఇప్పించాలని విద్యుత్ శాఖను ఆదేశించాడు.
ఆ వెంటనే అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక కౌన్సిలర్ సందీప్ దాస్ సహాయంతో, సకీనా, ఆమె కుటుంబ సభ్యుల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడానికి ప్రారంభ ఇన్‌స్టాలేషన్ ఛార్జీతో కనెక్షన్ అందించబడింది. ''నేను 36 ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నాను. విద్యుత్ కనెక్షన్ తీసుకునే స్థోమత లేదు. కానీ కాల అవసరాన్ని కాదనలేం. కాబట్టి నా పరిస్థితిని మంత్రికి తెలియజేయడం తప్ప నాకు వేరే మార్గం లేదు. వారి సహాయానికి నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను'' అని సకీనా అన్నారు.