ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థలు ఉండేవని చెబితే వినడమే తప్ప చూసింది లేదు. ఈ కాలంలోనైతే ఎక్కడ చూసినా పురుషాధిపత్యమే కనిపిస్తోంది. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే తెగలో మాత్రం ఇప్పటికీ మాతృస్వామ్య వ్యవస్థే అమలులో ఉంది. అంటే తల్లులే కుటుంబ పెద్దలుగా వ్యవహారిస్తారు. ప్రపంచంలోనే ఇంకా మాతృస్వామ్య వ్యవస్థ నడిపిస్తున్న ఏకైక తెగ వీరిది. వీరు ఒకప్పుడు అసోం రాష్ట్రంలో నివసించేవారు. 1972లో వీరు నివసిస్తున్న ఖాసీ, జైంతియా జిల్లాలను మేఘాలయలో కలిపేశారు.
ఈ తెగను 'ఖాసీ తెగ' అని పిలుస్తారు. ఖా అంటే వారి భాషలో 'పుట్టుక' అని, సీ అంటే 'పెద్ద తల్లి' అని అర్థం. వీరికి ప్రత్యేకించి ఏ మతం అంటూ లేదు. ప్రస్తుతం ఈ తెగలోని కొంత మంది క్రైస్తవాన్ని, కొందరు ఇస్లాంను, మరికొందరు హిందూ మతాలను స్వీకరించారు. అలాగే ఏ మతం స్వీకరించని వారు తమ ఆచారాలను పాటిస్తున్నారు. ఈ తెగ కుటుంబంలో అమ్మమ్మ కుటుంబ పెద్దగా వ్యవహరిస్తుంది. ఈ తెగలో అమ్మాయిగా పుడితే అదృష్టం వరించినట్లే. మాతృస్వామ్య వ్యవస్థ ఉండటం వల్ల ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నాక అత్తారింటికి వెళ్లాల్సిన అవసరం లేదు.
అబ్బాయే వచ్చి అమ్మాయి ఇంట్లో నివసించాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లోని కొడుకులు పెళ్లి చేసుకుని వారి అత్తారింటికి వెళ్తారు. ఇక ఇంట్లో పుట్టిన చిన్నకూతురుకి అమ్మమ్మ ఇంటిపై పూర్తి హక్కులు లభిస్తాయి ఖాసీ తెగలో అమ్మాయిలకు స్వేచ్ఛ కూడా ఎక్కువే. వారు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని పని చేసుకోవచ్చు. వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇక ఈ తెగలో జరిగేవన్నీ ప్రేమ వివాహాలే. యువకుడు తనకు నచ్చిన అమ్మాయిని వెతికి ప్రేమిస్తాడు. అమ్మాయి కూడా ఇష్టపడితే పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుంటారు.