న్యాయం కోసం ఓ తల్లి ఆరాటం.. పోలీసులే కారణమంటూ..
Kerala Woman Tonsures Head Seeking Action Against Cops In Daughters' Sexual Assault Case. కేరళలో సంచనలం సృష్టించిన వలయార్ లో తల్లి ఆరాటం
By Medi Samrat Published on 28 Feb 2021 6:39 AM GMT
కేరళలో సంచనలం సృష్టించిన వలయార్ అక్కాచెలెళ్ల అనుమానాస్పద మృతి కేసులో ఎస్ఐ చాకోపై చర్యలు తీసుకోవాలంటూ వారి తల్లి గుండు గీయించుకొని వినూత్నంగా నిరసన చేపట్టారు. బిందూ కమల్, సలీనా ప్రకాశ్ అనే సామాజిక కార్యకర్తలు సైతం సంఘీభావంగా గుండు గీయించుకున్నారు. ఆమెకు న్యాయం చేయడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆరోపించారు.
2017లో అక్కాచెల్లెళ్ల మృతికి ఎస్ఐ చాకో, డిప్యూటీ ఎస్పీ సోజన్ కారణమని బాధితురాళ్ల తల్లి పేర్కొన్నారు. వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన చిన్నకుమార్తె వర్ధంతి అయిన మార్చి4న భారీ ఎత్తున ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. వీరి నిరసనకు కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాస్ తో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు మద్దతు ప్రకటించారు. కాగా, అక్కాచెల్లెళ్ల మృతి కేసులో న్యాయం చేయాలంటూ వాళ్ల తల్లి నెలరోజులుగా చేస్తున్న దీక్ష ఈరోజు (ఫిబ్రవరి28)న ముగియనుంది.
2017లో వలయార్ ప్రాంతంలో అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసి చంపేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిర్దోషులుగా తేల్చుతూ కేరళ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆందోళనలు వెల్లువెత్తాయి. దిగువ కోర్టు తీర్పును కేరళ ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది.