హోటల్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 68 మంది మంది ఆసుపత్రి పాలు
Kerala Hotel Shut Down After 68 People Fall Ill Due To Food Poisoning.హోటల్‌లో భోజనం చేసిన వారిలో దాదాపు 68 మంది
By తోట వంశీ కుమార్ Published on 19 Jan 2023 8:37 AM ISTకేరళ రాష్ట్రం ఎర్నాకులం జిల్లాలోని ఉత్తర పరవూర్‌లోని మజిలిస్ హోటల్‌లో భోజనం చేసిన వారిలో దాదాపు 68 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతో వారు ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యారు. ఈ 68 మందిలో చెరైకి చెందిన గీతు అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఎర్నాకులం మెడికల్ కాలేజీకి తరలించారు.
విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారులు హోటల్-మజ్లిస్‌ను మూసివేశారు. ఈ 68 మందిలో ఇద్దరు పిల్లలతో సహా 28 మంది పరవూరు తాలూకా ఆసుపత్రిలో చేరగా, 20 మంది ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
సోమవారం సాయంత్రం ఈ హోటల్‌లో కుజిమంతి, అల్ఫాహం, షావాయి తిన్న వారికి తీవ్ర వాంతులు, విరేచనాలు అయ్యాయి. తొలుత ముగ్గురు వ్యక్తులు శారీరక అసౌకర్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. విషయం తెలియడంతో పరవూరు మున్సిపాలిటీ ఆరోగ్యశాఖ అధికారులు అక్కడికి చేరుకుని హోటల్‌ను హోటల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం హోటల్‌ను మూసివేశారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో వెంటనే తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆహార భద్రత కమిషనర్‌ను ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు.
ఇటీవల రాష్ట్రంలో అనేక ఫుడ్ పాయిజనింగ్ సంఘటనల నేపథ్యంలో కేటరింగ్ సేవల కోసం కేరళ ప్రభుత్వం గత శుక్రవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో క్యాటరింగ్ సేవలకు లైసెన్స్ తప్పనిసరి చేశామని, ఉద్యోగులకు హెల్త్ కార్డ్ తప్పనిసరి అని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా 189 రెస్టారెంట్లలో ఆహార భద్రతా విభాగం తనిఖీలు నిర్వహించగా 2 హోటళ్ల లైసెన్సు రద్దు చేయగా, మిగిలిన 37 హోటళ్లలో పరిశుభ్రత లోపించిందని నోటీసులు అందాయి.