గూఢచర్యం కేసులో అరెస్టైన జ్యోతి మల్హోత్రాతో కేరళ ప్రభుత్వానికి లింకులు..!

హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా అనే 33 ఏళ్ల ప్రముఖ వ్లాగర్ పాకిస్థాన్ గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఇటీవల అరెస్టయ్యారు.

By Medi Samrat
Published on : 7 July 2025 11:14 AM IST

గూఢచర్యం కేసులో అరెస్టైన జ్యోతి మల్హోత్రాతో కేరళ ప్రభుత్వానికి లింకులు..!

హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా అనే 33 ఏళ్ల ప్రముఖ వ్లాగర్ పాకిస్థాన్ గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఇటీవల అరెస్టయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జ్యోతిని కేరళ ప్రభుత్వం తన టూరిజం ప్రమోషన్ కోసం కొంతకాలం క్రితం అధికారికంగా ఆహ్వానించింది. జ్యోతి కేరళ పర్యటనకు అయ్యే ఖర్చు మొత్తం ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని ఇటీవల ఆర్టీఐలో వెల్లడైంది. ఆర్టీఐ ప్రకారం.. కేరళ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రచారంలో భాగంగా జ్యోతి రాష్ట్రాన్ని సందర్శించింది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల సహాయంతో డిజిటల్ ప్రపంచంలో కేరళను గొప్ప పర్యాటక కేంద్రంగా చూప‌డం ఈ ప్రచారం యొక్క లక్ష్యం. జ్యోతి బస, ప్రయాణ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించింది. జ్యోతి 2024 -2025 మధ్య కన్నూర్, కోజికోడ్, కొచ్చి, అలప్పుజా, మున్నార్ వంటి అందమైన ప్రాంతాలను సందర్శించింది. ఇదంతా కేరళ ప్రభుత్వం ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రోగ్రామ్ కింద జరిగింది. ఇందులో జ్యోతితో పాటు అనేక ఇతర డిజిటల్ సృష్టికర్తలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జ్యోతి తన వ్లాగింగ్ ద్వారా కేరళ అందాలను ప్రపంచానికి అందించింది.

గత కొన్నేళ్లల్లో జ్యోతి పలుమార్లు పాకిస్థాన్‌కు వెళ్లిందని, అక్కడి నిఘా సంస్థల అధికారులతో, ముఖ్యంగా పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఆరోప‌ణ‌ల తరువాత ఈ అధికారులలో ఒకరిని భార‌త్ దేశం నుండి బహిష్కరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో భారీ గూఢచర్య నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా అరెస్టయిన 12 మందిలో జ్యోతి కూడా ఉన్నారు. జ్యోతికి చెందిన యూట్యూబ్ ఛానెల్ 'ట్రావెల్ విత్ జో'పై కూడా విచారణ జరుగుతోంది.

Next Story