విషాదం.. మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల బాలిక మృతి
కేరళలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. త్రిసూర్‌లో తిరువిల్వామలలోని ఓ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక
By అంజి Published on 25 April 2023 7:15 AM GMTవిషాదం.. మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల బాలిక మృతి
కేరళలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. త్రిసూర్‌లో తిరువిల్వామలలోని ఓ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక చేతిలో వీడియో చూస్తున్న మొబైల్ ఫోన్ పేలడంతో ఆమె మృతి చెందింది. మృతురాలు పజ్యన్నూరు బ్లాక్ పంచాయతీ మాజీ సభ్యుడు అశోక్‌కుమార్, సౌమ్య దంపతుల కుమార్తె ఆదిత్యశ్రీ. సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికకు వైద్యసేవలందించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె కన్నుమూసింది. స్థానిక పోలీసు అధికారుల బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఫోరెన్సిక్ బృందం కూడా దర్యాప్తులో పాల్గొంది. చిన్నారి చాలా సేపు వీడియోలు చూస్తున్నందున ఫోన్ బ్యాటరీ వేడెక్కడం వల్ల ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫోరెన్సిక్ పరీక్ష తర్వాతే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్ పేలుడుపై నిపుణులతో సవివరంగా పరిశీలిస్తామని పోలీసు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఫోన్‌ను మూడేళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఆదిత్యశ్రీ మామ ఆమె తండ్రి కోసం ఫోన్ కొనుగోలు చేశారు. గతేడాది ఇదే దుకాణంలో ఫోన్ బ్యాటరీని మార్చారు. ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఆదిత్యశ్రీ, ఆమె అమ్మమ్మ మాత్రమే ఉన్నారు. అమ్మమ్మ ఆహారం తీసుకుని వంటగదికి వెళ్లగానే ఫోన్ పేలింది. “ఆ చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కుడి చేతి వేళ్లు తెగిపోయాయి. ఆమె అరచేయి విరిగిపోయింది” అని పోలీసులు తెలిపారు. ఆదిత్యశ్రీ తిరువిలవామల క్రైస్ట్ న్యూ లైఫ్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతుండేది.