ఈ మాస్క్ పెట్టుకొని గుసగుసలాడినా వినిపిస్తుంది

Kerala B-Tech student designs 'masks with mics'. కేరళలోని త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల బిటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి కెవిన్ జాకబ్ మైక్, స్పీకర్ ఉన్న మాస్కును తయారు చేశాడు.

By Medi Samrat  Published on  24 May 2021 10:09 AM GMT
mask with mics

కరోనా భూమ్మీదకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఈ దెబ్బకి మాస్క్ మన శరీరంలో భాగం అయిపోయింది. అప్పుడంతా అమ్మాయిలు చున్నీళ్లు మొహాలకి చుట్టుకుంటే తెగ జోకులేసేవారు.. ఇప్పుడు మాస్క్ లేకుండా అడుగు బయటకి పెట్టలేని పరిస్థితి వచ్చేసింది. అమ్మాయిలు స్కార్ఫ్ మర్చిపోవచ్చు, అబ్బాయిలు కర్చీఫ్ మర్చిపోవచ్చు కానీ మాస్క్ మరిచిపోతే మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకున్నటే. అయితే మాస్క్ పెట్టుకుంటే ఒకటే సమస్య.. ఏంటి లిప్ స్టిక్ వేసుకోవడానికి కుదరదు అని అనుకుంటున్నారా కాదు.. మన మాటలు ఎదుటివారికి వినపడవు.. ఒకవేళ వినబడినా గానీ క్లారిటీ ఉండదు. దీంతో చెప్పిన మాటే మళ్లీ మళ్లీ చెప్పాల్సి వస్తుంది. మనమే అలా ఫీల్ అయితే డాక్టర్ల పరిస్థితి ఏంటి.. పేషంట్లకు వాళ్ళు ప్రతి విషయాన్ని గట్టిగా అరిచి చెప్పాల్సిందే నా.. ఈ కష్టాన్ని గుర్తించాడు ఒక యువకుడు. డాక్టర్ లు అయిన తల్లిదండ్రుల కోసం ఓ కొత్త ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. కేరళలోని త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల బిటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి కెవిన్ జాకబ్ మైక్, స్పీకర్ ఉన్న మాస్కును తయారు చేశాడు.

కెవిన్ జాకబ్ తల్లిదండ్రులు ఇద్దరూ కేరళలోని త్రిస్సూర్‌లో ప్రముఖ వైద్యులు. కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి రోగులతో కమ్యూనికేట్ చేయడానికి వారు చాలా ఇబ్బంది పడ్డారు. ఇది గుర్తించిన కెవిన్ మైక్, స్పీకర్‌తో కూడిన మాస్క్‌ను రూపొందించాడు. దీని మొదటి నమూనాను తల్లిదండ్రులైన డాక్టర్ సెనోస్ కాసే, డాక్టర్ జ్యోతి మేరీ జోస్‌తో కలిసి పరీక్షించాడు. మంచి ఫలితాలు రావడంతో తెలిసినవారి నుంచి కావాలాంటూ డిమాండ్ పెరిగింది. అతను మరిన్నింటిని తయారు చేయడం మొదలు పెట్టాడు. దీనిని 30 నిమిషాలు చార్జ్‌ చేస్తే ఆరు గంటలపాటు నిర్విరామంగా ఉపయోగించవచ్చు. ఇలాంటి స్పీకర్ మాస్కులను 50 కి పైగా తయారు చేశాడు కెవిన్. ఎవరైన స్పాన్సర్లు దొరికితే వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సిద్ధం అంటున్నాడు.
Next Story
Share it