పంజాబ్ ప్రజలు మ్యాజిక్ చేశారు : క్రేజీవాల్
Kejriwal thanks people of Punjab after trends show landslide win for AAP.పంజాబ్ రాష్ట్రాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ
By తోట వంశీ కుమార్ Published on 10 March 2022 4:25 PM ISTపంజాబ్ రాష్ట్రాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఊడ్చేసింది. అంచనాలకు మించి భారీ విజయాన్ని సాధించింది. ఆమ్ ఆద్మీ ధాటికి ప్రముఖ నేతలు కూడా నిలవలేకపోయారు. ప్రస్తుతం సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ, మాజీ సీఎం అమరీందర్‌సింగ్, పీసీసీ చీఫ్ సిద్ధూ ఇలా దాదాపు రాజకీయ ప్రముఖులు అందరూ ఓటమి పాలయ్యారు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ (ఆప్)ఇప్పటికే 90కిపైగా స్థానాల్లో విజయం సాధించింది. ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆనందం వ్యక్తం చేశారు.
పంజాబ్ ప్రజలు నేడు ఓ మాయాజాలం చేశారన్నారు. పంజాబ్ ఫలితాలు ఓ పెద్ద విఫ్లవం లాంటివని.. పెద్ద పెద్ద నాయకులే అడ్రస్ లేకుండా పోయారన్నారు. ఆంగ్లేయులను తరిమేసి, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దేశంలో సిస్టమ్ మారకుంటే ఏం లాభం లేదని భగత్ సింగ్ అనేవారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచీ ఈ పార్టీలన్నీ ఆంగ్లేయుల విధానాన్నే ఇంకా ఫాలో అవుతున్నాయని తెలిపారు. పెద్ద పెద్ద నాయకులంతా దేశ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు.
అయితే.. ఆమ్ ఆద్మీ పార్టీ మార్పు మొదలు పెట్టిందని వెల్లడించారు. పంజాబ్ వేదికగా ఎన్ని కుతంత్రాలు పన్నారో అందరికీ తెలుసు. ఆప్‌కు వ్యతిరేకంగా అంతా ఒక్కటై.. అధికారులను అటూ ఇటూ బదిలీలు చేశారు. అందరూ కలిసి ఆప్ కు వ్యతిరేకంగా పని చేశారు. కేజ్రీవాల్ ఓ తీవ్రవాది అని అన్నారు. అయితే.. కేజ్రీవాల్ టెర్రరిస్ట్ కాదని దేశ ప్రజలు స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఓ దేశ భక్తుడని తీర్పు ఇచ్చారు. మనం అందరం కలిసి ఓ కొత్త భారత దేశాన్ని నిర్మిద్దాం. ఒకరినొకరు ప్రేమించుకునే భారత్‌ను నిర్మిద్దాం. అందరూ కడుపు నిండా అన్నం తినే భారతాన్ని నిర్మిద్దాం. వైద్య చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లాలా..? ఇక్కడే చదివేలా ఏర్పాట్లు చేయలేమా..? అని ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ అంటే పార్టీ కాదు. అదో విప్లవం.. భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తాం. పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న భగవంత్ సింగ్ మాన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు.