బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లిన వ‌ధువు.. ఆగిపోయిన పోయిన పెళ్లి.. కార‌ణం ఏమిటంటే..?

వ‌ధువు బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్ల‌గా ఆమె ముఖం వికృతంగా మారింది. దీంతో వ‌రుడు పెళ్లిని ర‌ద్దు చేసుకున్నాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2023 9:31 AM IST
Karnataka, Beauty parlour

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


ఆ ఇంట పెళ్లి సంద‌డి మొద‌లైంది. మ‌రో రెండు రోజుల్లో పెళ్లి భాజాలు మోగ‌నున్నాయి. వ‌ధువు పెళ్లి కోసం సిద్ద‌మ‌వుతోంది. పెళ్లిలో అందంగా క‌నిపించాల‌ని ఆమె భావించింది. దీంతో స్థానికంగా ఉన్న బ్యూటిపార్ల‌ర్ కు వెళ్లింది. ఆమె చేసిన ఈ ప‌ని కార‌ణంగా ఆమె వివాహం ర‌ద్దైంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..?

క‌ర్ణాట‌క రాష్ట్రంలోని హసన్‌ జిల్లాలోని ఆరాసికేర్ గ్రామంలో ఓ యువ‌తి త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. ఇటీవ‌ల ఓ యువ‌కుడితో ఆమెకు వివాహం నిశ్చ‌య‌మైంది. ఎంగేజ్‌మెంట్ కూడా పూరైంది. త‌న కొత్త జీవితంపై ఎన్నో క‌ల‌లు కంటోంది వ‌ధువు. మ‌రో రెండు రోజుల్లో పెళ్లి ఉంది అన‌గా తాను ఇంకా అందంగా క‌నిపించాల‌ని బావించింది. త‌న ఇంటికి స‌మీపంలో ఉన్న బ్యూటీపార్ల‌ర్‌కు వెళ్లింది.

ఫేషియ‌ల్ అనంత‌రం ఆవిరి ప‌డుతున్న క్ర‌మంలో వేడి కార‌ణంగా ఆమె ముఖం క‌మిలిపోయింది. చ‌ర్మం న‌ల్ల‌బ‌డ‌డంతో పాటు ముఖం వాచి పోయింది. వెంట‌నే ఆమె ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతోంది. వ‌ధువు ముఖాన్ని చూసిన పెళ్లి కొడుకు ఒక్క‌సారిగా కంగుతిన్నాడు. ఆమెను పెళ్లి చేసుకోన‌ని చెప్పేశాడు.

వ‌రుడికి న‌చ్చ‌జెప్పేందుకు ప్ర‌య‌త్నించినా లాభం లేక‌పోయింది. చేసేది లేక వివాహాన్ని ర‌ద్దు చేశారు. వ‌రుడి నిర్ణ‌యంతో వ‌ధువు కుటుంబ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇందుకు కార‌ణమైన బ్యూటీ పార్ల‌ర్ య‌జ‌మాని గంగ పై వ‌ధువు కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న స్థానికంగా హాట్ టాఫిక్‌గా మారింది.

Next Story