మసీదుల్లోనూ, దర్గాలలోనూ రాత్రి 10 నుండి ఉదయం 6 వరకూ లౌడ్ స్పీకర్స్ పై నిషేధం

Karnataka Waqf Board bars use of loudspeakers between 10 pm to 6 am during azaan. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 వరకూ లౌడ్ స్పీకర్స్ ను ఉపయోగించరాదని పిలుపును ఇచ్చింది.

By Medi Samrat
Published on : 17 March 2021 5:10 PM IST

Karnataka Waqf Board bars use of loudspeakers between 10 pm to 6 am during Ramzaan

పవిత్ర రంజాన్ మాసం త్వరలోనే మొదలు కాబోతోంది. ఉదయానే నిద్ర లేపుతూ పలు చోట్ల లౌడ్ స్పీకర్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కర్ణాటక రాష్ట్ర వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 వరకూ లౌడ్ స్పీకర్స్ ను ఉపయోగించరాదని పిలుపును ఇచ్చింది. శబ్ద కాలుష్యం నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వక్ఫ్ బోర్డు తెలిపింది. మసీదులు, దర్గాల వద్ద పెద్ద ఎత్తున లౌడ్ స్పీకర్స్ ను ఉపయోగించడం కారణంగా చాలా మందికి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయని.. ఇతరుల మంచి కోరి ఈ నిర్ణయం తీసుకుంటూ ఉన్నామని కర్ణాటక వక్ఫ్ బోర్డు ఓ సర్కులర్ ను జారీ చేసింది.

సైలెన్స్ జోన్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలను ఉల్లంఘించరాదని అందులో కోరారు. రాత్రి 10 గంటల నుండి తెల్లవారు జామున 6 గంటల వరకూ లౌడ్ స్పీకర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని అందులో తెలిపారు. ఉదయం సమయంలో లౌడ్ స్పీకర్లను వాడే సమయంలో కూడా ఎయిర్ క్వాలిటీ, శబ్ద కాలుష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అజాన్, ఏవైనా ముఖ్యమైన అనౌన్స్మెంట్లు అలాంటి వాటికి మాత్రమే లౌడ్ స్పీకర్లను వాడాలని కోరారు. మసీదుల్లో ఆంప్లిఫైర్ ను వాడే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే దర్గాల దగ్గర, మసీదుల దగ్గర వాయుకాలుష్యానికి కారణమయ్యే వాటిని కాల్చరాదని కోరారు. మసీదులు, దర్గాల దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశాల్లో చెట్లను పెంచడమే కాకుండా.. జంతువులు, పక్షుల కోసం నీటి ట్యాంకులను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా పరిశుభ్రతకు పెద్ద పీఠ వేయాలని సూచించారు.

మరో వైపు తన నివాసానికి సమీపంలో ఉన్న ఒక మసీదులో 'అజాన్' కోసం ఉపయోగించే లౌడ్ స్పీకర్లను నిషేధించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ (డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్)కు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సంగీత శ్రీవాస్తవ లేఖ రాశారు. అజాన్ వల్ల తన నిద్రకు భంగం కలుగుతోందని చెప్పారు. అజాన్ అయిపోయిన తర్వాత తనకు మళ్లీ నిద్ర పట్టడం లేదని చెప్పారు. దీని వల్ల తనకు తలనొప్పి రావడమే కాకుండా.. తన పనితీరుపై కూడా ప్రభావం పడుతోందని అన్నారు. రంజాన్ సమయంలో ఉదయం 4 గంటల నుంచే మైకుల్లో అనౌన్సుమెంట్లు ప్రారంభమవుతాయని, అది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పారు. తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని చెప్పారు. లేఖ కాపీలను ప్రయాగ్ రాజ్ డివిజనల్ కమిషనర్, ప్రయాగ్ రాజ్ ఎస్ఎస్పీ లకు పంపించారు. ఈ లేఖపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.


Next Story