బీజేపీ యువ మోర్చా జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్ నెట్టారు హత్య కేసును కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కు అప్పగించారు. హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామమని.. ఏ సంస్థలనూ వదిలేది లేదని అన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పోలీసు చీఫ్ ప్రవీణ్ సూద్, ఇతర ఉన్నతాధికారులతో బొమ్మై అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేసును ఎన్ఐఏ కు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు.
ఇక అవసరమైతే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు అవలంభిస్తున్న విధానం తాము కూడా అమలు చేస్తామన్నారు. యూపీలో అల్లర్లకు పాల్పడేవారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం యోగి సర్కారు విధానాన్ని పరిస్థితులను బట్టి కర్ణాటకలో కూడా అమలు చేస్తామని చెప్పారు. "ప్రవీణ్ కేసు అంతర్ రాష్ట్ర సంబంధాలతో వ్యవస్థీకృత నేరంగా అనుమానిస్తున్నాం. కేసుకు సంబంధించిన తాజా సమాచారాన్ని సేకరించాల్సిందిగా అధికారులను కోరాను. విచారణ ముమ్మరం చేస్తున్నారు. కేసును ఎన్‌ఐఏకి అప్పగించాలని నిర్ణయించుకున్నాం. హోం శాఖ లేఖ ఈ విషయాలను చూసుకుంటుంది'' అని బొమ్మై చెప్పారు. కేరళతో కర్ణాటక సరిహద్దులలో సెక్యూరిటీపై కూడా బొమ్మై చర్చించారు.
ఈ హత్య కేసులో కేరళ రాష్ట్రం కాసరగోడులో ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి సుళ్య తాలూకాలో ప్రవీణ్ నెట్టారు హత్య జరిగిన వెంటనే ఏడీజీపీ అలోక్ కుమార్ పర్యవేక్షణలో ఆరు ప్రత్యేక బృందాలు హంతకుల వేట చేపట్టాయి. హత్య కేసులో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న షఫీక్ బెళ్లారె, జాకీర్ సవణూరును కేరళ రాష్ట్రం కాసరగోడు పట్టణంలో అరెస్టు చేసినట్లు ఏడీజీపీ అలోక్ కుమార్ బెంగళూరులో ప్రకటించారు.