Karnataka: యువకుడిపై లైంగికదాడి కేసులో సూరజ్ రేవణ్ణ అరెస్ట్
కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 10:15 AM ISTKarnataka: యువకుడిపై లైంగికదాడి కేసులో సూరజ్ రేవణ్ణ అరెస్ట్
కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. ఇప్పటికే జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు అక్కడి రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఇప్పుడు ప్రజ్వల్ సోదరుడు కూడా లైంగిక దాడి కేసులోనే ఇరుక్కున్నాడు. ప్రజ్వల్ సోదరుడు డాక్టర్ సూరజ్ రేవన్ణపై లైంగిక దాడి కేసు నమోదు అయ్యింది. ఒక యువకుడు సూరజ్ రేవణ్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు సూరజ్ రేవణ్ణను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. సూరజ్ రేవణ్ణ జేడీఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ తనపై అసహజ లైంగిక దాడి చేశాడని చేతన్ కేఎస్ అనే జేడీఎస్ కార్యకర్తే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. హాసన్ జిల్లాలోని అరకలగూడుకి చెందిన అతను వీడియోలను కూడా పోలీసులకు అందించాడు. లోక్‌సభ ఎన్నికల సమయంలో పరిచయమైన సూరజ్.. తనని ఫాంహౌస్ కు పిలిచాడని చెప్పాడు. అక్కడికి వెళ్లిన సమయంలోనే దాడికి యత్నించాడని ఆరోపించాడు. ఇక అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఈ టెస్టుల్లో బాధితుడి శరీరంపై గాయాలు అయినట్లు తేలింది. దాంతో.. పోలీసులు తాజాగా ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఆ యువకుడు పెట్టిన కేసును సూరజ్ అనుచరులు కొట్టిపారేస్తున్నారు. తనకు రూ.5కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడనీ.. లేదంటే లైంగిక దాడి కేసు పెడతానని యువకుడే బెదిరించాడని సూరజ్ అనుచరుడు శివకుమార్ చెప్పాడు. ఈ మేరకు అతను కూడా హోళినరిసిపురం పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. ఉద్యోగం కోసం చేతన్ తనని కలిశాడనీ.. ఆ తర్వాత తానే సూరజ్ నంబర్ ఇచ్చి కలవమన్నానని చెప్పినట్లు తెలిపాడు. ఆ తర్వాత యువకుడు సూరజ్‌ను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడని ఆరోపించాడు.