ఓలా, ఉబర్, ర్యాపిడోలకు షాకిచ్చింది ప్రభుత్వం. యాప్ ఆధారిత సేవలు అందిస్తున్న ఈ సంస్థలు తమ ఆటో సర్వీసులను నిలిపివేయాలని ఆదేశించింది. ఇందుకు మూడు రోజుల సమయాన్ని ఇచ్చింది. నిబంధనలను విరుద్దంగా వినియోగదారుల నుంచి అధిక మొత్తంతో వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదండి.. కర్ణాటక రాష్ట్రంలో.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొలి 2 కిలోమీటర్ల వరకు రూ.30 వసూలు చేయాలి. ఆ తరువాత ప్రతి కిలోమీటర్‌కు రూ.15 చొప్పున తీసుకోవాలి. అయితే.. ఈ కంపెనీలు తొలి 2 కిలోమీటర్ల కంటే తక్కువ దూరానికి కూడా రూ.100 వసూలు చేస్తున్నాయని కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదు అందాయని రవాణాశాఖ కమిషనర్ టీఎంకే కుమార్ తెలిపారు. ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలకు ఇచ్చిన లైసెన్స్ మోటర్ క్యాబ్ నడపటానికేనని, ఆటోలకు లేదని చెప్పారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఆ సంస్థలను హెచ్చరించారు.
దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఆటో రిక్షాలు నడుపుతున్నారంటూ ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో పాటు ఆటో రిక్షా సేవలు నిలిపివేయాలని ఆదేశించింది. ఎందుకు నిలిపివేయకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది.