దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక కర్ణాటక రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉంది. దీంతో ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు కర్ణాటకలో లాక్‌డౌన్‌ను విధించారు. లాక్‌డౌన్ పెట్టడంతో వలస కూలీలు, రోజు వారీ పనులు చేసుకునే వారి పరిస్థితిని దయనీయంగా ఉంది. వారి ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఐదు కిలోల బియ్యం ఇస్తోంది.
ఇక ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన ఐదు కిలోల బియ్యం స్థానంలో కర్ణాటక ప్రభుత్వం గోధుమలు, జొన్నలు జోడించి బియ్యాన్ని రెండు కిలోలకు తగ్గించింది. అయితే.. లాక్‌డౌన్ సమయంలో రెండు కిలోల బియ్యం ఏ మాత్రం సరిపోవని గదగ జిల్లాలో రైతులు ఆందోళన బాట పట్టారు. సమస్య తీవ్రతను తెలియజేసేందుకు ఆందోళనకారుల్లో ఒకరైన ఈశ్వర ఆర్య అనే వ్యక్తి బుధవారం ఆరాష్ట్ర ఆహార, పౌరసరఫరా శాఖ మంత్రి ఉమేశ్ కత్తికి ఫోన్ చేసి తమ గోడును వినిపించారు.
రెండు కిలోల బియ్యం ఎటూ సరిపోవని.. మునుపటిలానే ఐదు కేజీల బియ్యం ఇవ్వాలని మంత్రిని కోరారు. ఐదు కిలోలు ఇవ్వకుంటే తాము బతకమలేమని మంత్రికి వివరించారు. అయితే.. 'బతకలేకపోతే.. చస్తే మరీ మంచిది. మేమిచ్చేది ఇంతే' అని మంత్రి దురుసుగా సమాధానం ఇచ్చారు. మంత్రి చేసిన వ్యాఖ్యాలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో తాను మాట్లాడింది నిజమేనంటూ అంగీకరించిన మంత్రి.. చివరకు క్షమాపణ చెప్పారు.